ఈ అలవాటు ఎప్పటిదో ఎక్కడదిదో తెలీదుకాని.. ప్రొదున్నే ఓ కప్పు నిశివర్ణోష్ణోదకము.. అదే ఆంగ్లములో కాఫీ పడకపోతే (..దిండుపోతే దుప్పట్టిపోతే కాదు.. రోడ్డు మీదో రోకటి మీదో కూడా కాదు .. కడుపులో పడకపోతే) రోజంతా అదోమాదిరిగా – ప్రొదుట్టే MS గారి సుప్రభాతం బదులు ‘ఇప్పటికింకా నా వయస్సు ..’ వింటూ లేచినంత వెరైటీగా ఉంటుంది. రాత్రే డికాక్షన్ కి వేసి పడుకుంటా.. కాని నిన్న మరిచ.. ప్రొదున్న లేచి చూస్తే ఇంట్లో కాఫీ కి పొడి లేదు. పోనీ కాఫీ కాయలు (కాఫీ బీన్సు) అయినా ఉంటే నమిలేద్దాం అనుకున్నా… అవి కూడా లేవు. ఏం చేయాలో బోధపడలేదు .. కాఫీ తాగితేనే నా బుర్ర పని మొదలెట్టేదానికి ఓ అరగంట పైనే పడుతుంది.. ఇంక కాఫీ లేకపోతే అంతే సంగతి.
దేవదాసు పక్కనే లేని కుక్కలా .. జారిపడేదానికి మనిషిలేని అరటితొక్కలా.. కఫీ లేని నా జీవితం ఒక్కటే అని అనిపించింది. ఏదో ఒక ద్రవం అని .windexO phenylO కోసం వెతుకుతూ పిచ్చి కేకలు పేడుతున్న నన్ను చూసి మా ఆవిడ తను ఊరెళ్తే నాలో కనిపించే ఆనందానికి విరుద్ధంగా కనిపించాను. ఇలా కుదరదని పక్కనే ఉన్న కొట్టుకెళ్ళి తనే పొడి తెచి కాఫీ పెట్టిచింది. ఆఫీసు కి వెళ్ళాక, రాసే ఫార్ లూపులు ఎప్పుడైనా రాయచ్చులే అని అసలు ఈ కాఫీ యొక్క పుట్టుపూర్వోత్తరములు గురించి ఆరాతీసా కొద్ది గంటలు. అప్పుడు తెలిసింది..
నిశివర్ణోష్ణోదకోత్పత్తి –
శూతమహాముని అలా నడుచుకుంటూ వెళ్తూంటే హరప్పా మొహెంజదారోలోని ఆడ-లేడీస్ ఆయన్ని ఆపి ఇలా అడిగారు –
‘స్వామీ మేము ప్రొదుట్టే లేచి ఈ-మేల్ చూసుకున్నాక కూడా ఈ మగజాతి లేవదు. ఇలా అయితే ఇల్లు చిమ్మి ముగ్గెట్టి బిందెలతో నీళ్ళుతెచి మాకు టిఫినీలు చేసేదిక్కు ఉండదు. వీళ్ళని ఉదయాన్నే లేపే ఏదైనా ఉపాయం చెప్పండి?’
అందుకు ఆ మాహాముని ఇలా అన్నరు – ‘పూర్వము జనసేనపురం అనే ఒక పట్టణం లో మీలాంటి ఒక బాధితురాలు ఉండేది. ఆవిడ పేరు నిశివర్ణన. వాళ్ళ ఆయన కూడా మీ వాళ్ళ లాగా ఉదయాన్నే అంటే అదే పదకొండు – పన్నెండు కు లేచేవాడు. ఇలా ఐతే ఇంటిపనులు అలానే ఆగిపోతాయి వంటా వార్పు .. పిల్లల స్కూలూ గట్రా కి ఆలస్యం ఔతుంది అని గ్రహించిన ఆ నిశివర్ణన ఈ విషయం మీద ఈశ్వరుని కొరకు తపస్సు చేసింది.
ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకొమ్మన్నడగగా నిశివర్ణన తన బాధని తెలిపింది. అప్పుడు ఆ పరమేశ్వరుడి ఒక ఉదకము గురించి తెలిపి అది ఎలా చేయాలో కూడా చెప్పి, ఉదయన్నే ఈ ఉదకము సేవించేట్టూ ఒక వ్యసనం చేసి మాయమయ్యడు. అలా అప్పటి నుండి ఆ నిశివర్ణన తూ.చా తప్పకుండా ఉదయాన్నే లేచీ ఆ ఉదకమును తయారు చేసి తన భర్త కి ఇచ్చి పనులు చేయించుకునేదీ.
అందుకే ఆ ఉదకముని నిశివర్ణోష్ణోదకము అని అంటారు అని చెప్పి అది ఎల చేయాలో కూడా వివరంగా చెప్పి తన ఉదయ వ్యాహ్యాళి కి వెళ్ళారు శూతమహాముని.
అది మొదలు ఇన్ని వేల సంవత్సరాలు ప్రొదుట్టే లేచి కాఫీ పెడుతున్న మన ఆడ-లేడీస్ కోసం ఈ పాట అంకితం
లేచింది నిద్ర లేచింది మహిళా లోకం
పాలు కాచింది కాఫీ కోసం…
Disclaimer: This is post just for fun and not indented to hurt anyone’s feelings. In case it does, the author apologizes in advance.
DISCLAIMER: The author is solely responsible for the views expressed in this article. The author carries the responsibility for citing and/or licensing of images utilized within the text.