ఎనిమిది కోట్ల తెలుగుప్రజల శ్రవణ పేటికలలో రింగుమని మారుమ్రోగే తల్లి కీర్తిని తేటతెనుగించిన భావకవి, సుందరకవి, విరచితం.

మా తెనుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించునాతల్లి ।

గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను,
బంగారు పంటలే పండుతాయీ
మురిపాల ముత్యాలు దొరలుతాయి ।

అమరావతీ గుహల అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు,
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా ।
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి కృష్ణరాయని కీర్తి,
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుతాం ।

జై తెనుగు తల్లీ, జై తెనుగు తల్లీ, జై తెనుగు తల్లీ ।।

– (ప్రసన్నకవి, భావకవి, అహంభావకవి, సుందరకవి) శ్రీ శంకరంబాడి సుందరాచారి (1914 – 1977)

“కవితకు నిత్య నూతనత్వం అలవడాలి. అన్వేషించే కొద్దీ అపురూప భావాలు పొడమాలి. ఉత్సాహం వృద్ధికావాలి. ఆశలు రేకెత్తాలి. ఒకే కావ్యం ఏనాటికానాడు క్రొంగ్రొత్తగా కనిపించాలి. ఊహించేకొద్దీ విస్తరిల్లాలి. మనోవాతావరణాన్ననుసరించి మారుతూ రావాలి. కావ్యమే నాలుగు గీటులైతే కావ్యార్థం నాలుగు గ్రంధాలు కావాలి. అదే అమరకవిత…” అన్న అమరకవి సుందరకవి గారి మాటలతో క్రియేట్లీ వేదికపై మొట్టమొదటి తెలుగు శీర్షిక గా మన తెలుగు రాష్ట్ర గీతాన్ని ప్రస్తుతించడం తెలుగు భాషకి, తెలుగు జాతకి, తెలుగు కవిసామ్రాట్లకి గౌరవప్రదం.

।। జై తెలుగు తల్లి ।।

DISCLAIMER: The author is solely responsible for the views expressed in this article. The author carries the responsibility for citing and/or licensing of images utilized within the text.