మాఊరు పేరు రౌతులపూడి. అసలు ఏ గ్రామానికైనాపుాడి అనే పేరు వచ్చిందంటే, ఒకప్పుడు ఆ పరిసరాలలో బౌధ్ధమతం ఉజ్వలంగా వర్థిల్లిందని అర్థమట. దానికి నిదర్శనంగానే, మా చుట్టుప్రక్కలగ్రామాలలో అనేక తవ్వకాలలో బైధ్ధమత చిహ్నాలెన్నో నేడు లభిస్తున్నాయి. ముఖ్యంగా రౌతులపూడికి అతిసమీపంలోగల ములగపూడిలో ఎన్నో బౌధ్ధమతచిహ్నాలు నేటికీ తవ్వకాలలో దొరుకుతూనే వున్నాయి.

మాఊరు పేరు రౌతులపూడి. అసలు ఏ గ్రామానికైనాపుాడి అనే పేరు వచ్చిందంటే, ఒకప్పుడు ఆ పరిసరాలలో బౌధ్ధమతం ఉజ్వలంగా వర్థిల్లిందని అర్థమట. దానికి నిదర్శనంగానే, మా చుట్టుప్రక్కలగ్రామాలలో అనేక తవ్వకాలలో బైధ్ధమత చిహ్నాలెన్నో నేడు లభిస్తున్నాయి. ముఖ్యంగా రౌతులపూడికి అతిసమీపంలోగల ములగపూడిలో ఎన్నో బౌధ్ధమతచిహ్నాలు నేటికీ తవ్వకాలలో దొరుకుతూనే వున్నాయి. అలాగే ఎప్పటి నిర్మాణమో తెలాయని, అతిపురాతన రామాలంయంవుంది ములగపూడిలో. అది అచ్చు భధ్రాచలంలోని సీతారామస్వామివారి దేవాలయం లాగానే వుంటుంది. సీతమ్మవారు కూడా రాములవారి ఒడిలోనే కూర్చొని వుంటారు. గొప్ప పూజలూ ,ఉత్సవాలూ అక్కడ జరుగుతూవుంటాయి.

మరో రకంగా మా ఊరు రౌతులపూడి అనే పేరు రావడానికి కారణం పెద్దాపురం మహారాజుల పాలనలో వుండేది. వారు ఈ రౌతులపూడినుండి కూడా పాలనా కార్యక్రమాలు నిర్వహించేవారని అనుకోవచ్చు. ఎందుకంటే ,రౌతులపూడి నడిబొడ్డులోవున్న ఒక ప్రదేశాన్ని ఇప్పటికీ ‘కోటదిబ్బ’ అని పిలువబడుతూవుంది.

పెద్దాపురం రాజుల పాలన ఇటు విశాఖ పట్టణం వరకూ,అటు గుంటూరు వరకూ విస్థరించి బలమైన సంస్థానంగా వుండేదిట.ఈ మద్యలోగల పాలకులందరూ పెద్దాపురం ప్రభువులక్రింద సామంతులుగా వుండేవారట. ఆవిధంగా పెద్దాపురం సంస్థానానికి చెందిన గుర్రపు రౌతులకు ఈ గ్రామంలో ఈనాములుగా భూములను రాజావారు ఇచ్చేరుట.అంతేగాక ,ఈ ఊరిలోగల ‘అడ్డాల’వారనే ఇంటిపేరుగల వంటరి దొరల పర్యవేక్షణలో, సైనికులకు శిక్షణాకేంద్రం నడపబడేదిట.

అలాగే మా రౌతులపూడి కమ్మర పనివారు చాలా ప్రసిధ్ధి చెందినవారు. వీరు పెద్దాపురం సంస్థానానికి యుద్దానికి కావలసిన బరిసెలు,ఈటెలు మొదలైన ఇనుపవస్తువులు తయారు చేయడమేకాకుండా నాటు తుపాకులుకూడా చేయగల నేర్పరులు. ఈ కారణంగానే అల్లూరి సీతారామరాజుకు కావలసిన ఆయుధాలు సమకూరుస్తున్నారనే అనుమానంతో బ్రిటిష్ దొరప్రభుత్వం, మా రౌతులపూడి కమ్మరులను చంపడానికి వచ్చినప్పుడు, ఊరు ఊరంతా ఏకమై బ్రిటిష్ వారిని ఎదిరించి కమ్మరుల ప్రాణాలు కాపాడారుట.

బ్రిటిష్ దొరకు ఇలాంటి అనుమానం ఎందుకు కలిగిందంటే అల్లూరి సీతారామరాజు ఏజన్సీకి ముఖద్వారమైన రౌతులపూడినుండి తరచూ ప్రయాణించి ములగపూడి, S పైడిపాలలో గల కొండ కనుమలగుండా సీలేరు ,చింతపల్లి, నర్శీపట్టణం మొదలైన పోలీస్టేషన్ల ఆనుపానులు తెలిసికొని ముట్టడి చేసేవాడట. ఆరోజుల్లోనే రౌతులపూడిలో ఫారెష్టరు బంగ్లా, ట్రావెలర్స్ బంగ్లా నిర్మించారు. ఒకసారి అలా సీతారామరాజు మా ఊరి ట్రావెలర్స్ బంగ్లాలో రాత్రి విడిది చేశారుట. అప్పటికి ఎనిమిది, పదేళ్ళబాలుడుగావున్న మా నాన్న, కొండరాజు, అంతుతెలియని జబ్బుతో బాధపడుతుావుండగా, మా పెద్దనాయనమ్మ మోగంటి సుబ్బమ్మగారు ప్రాణాపాయంలోవున్న మానాన్న కొండరాజుని తీసికెళ్ళి , సీతారామరాజు పాదాలపైవుంచి, ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడితే, ఆయన మంత్రించిన ఒక తాయెత్తును ఇస్తూ, ఈ బాలుడు మంచి కీర్తిగలిగి వర్థిల్లగలడని ఆశీర్వదించారుట. వెంటనే జబ్బు మళ్ళిపోవడమేకాకుండా, ఆ తరువాత రోజుల్లో సీతారామరాజు ఆశీస్సులు ఫలించి మానాన్న కొండ్రాజు ‘మంచివాడు, ‘అజాతశత్రువు’ అన్న కీర్తిని సంపపాదించుకొన్నారు.

అప్పటికింకా మనరాష్ట్రం మద్రాసు రాష్ట్రంతో కలసివున్నప్పుడు మానాన్న ఈ రౌతులపూడికి గ్రామకరణంగావున్నప్పుడు , గ్రామంలో జరిగిన అభేద్యమైన హత్యకేసును చాకచక్యంగా కనిపెట్టి, పోలీసువారికి సహరించినదుకుగాను, మా నాన్న కొండ్రాజుకు, మద్రాసు ప్రభుత్వంవారిచే బహుకరించబడిన మూడు తలల సింహం గుర్తుగాగల వెండిలాఠీ సీతారామరాజు ఆశీస్సులకు గుర్తుగా నేటికీమాఇంటవుంది. అలాగేమా నాన్నకి బాల్యంలో సీతారామరాజు ఇచ్చిన తావీదు కూడా మా నాన్న తదనతరం మా ఇంట్లో వుంది. ఈ తావీదు, వెండి లాఠీ మా నాన్న జ్ఞాపక చిహ్నాలుగా మేము భావిస్తాము.

ఒకప్పుడు మా గ్రామం కళల కాణాచిగా వుండేదట. తోలుబొమ్మలాటలు, నాటకాలు, హరికథలు, చెట్టు భజనలు మొదలైనవేవో ప్రతిరోజూ జరుగుతూవుండేవి. ఊర్లోవారు నాటకాలు స్వయంగా వేయడమే కాకుండా పేరుమోసిన పెద్దపెద్ద నటులను తీసుకువచ్చి నాటకాలేసేవారు. కోలాటం ఆడడం మా ఊరి ప్రత్యేకతగా వుండేది. అన్ని వీధులలోగల రామకోవెలలలోనూ, ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ, ఊరి ప్రజలు అహ్లాదంలో మునిగి తేలుతూవుండేవారు.

మాఊరిలో ఉమాదేవి, రామలింగేశ్వర్ల ఆలయం మా ఊరికి పది పదిహేను కిలోమీటర్ల (అడ్డదారిలోవెళితే ఐదుకిలోమీటర్లు) సమీపంలో వున్న అన్నవరం వీరవేంకట సత్యనారాయణమూర్తి ఆలయంకంటే కూడా అతిపురాతనమైనది. ఈ ఆలయానికి రామలింగేశ్వరుడు చిట్ట్రాప్రగడ వారి అబ్బాయిగాను, అమ్మవారు ఉమాదేవి గోటేటి వారమ్మాయిగాను పూజలందుకొంటారు.

ఈ గుడికి బలరాం పురములోని ప్రసిధ్ధులైన, సోమరౌతు చెంచుబాబుగారి తల్లిగారైన , వెంకాయమ్మగారు గుడికి అనేక మాన్యాలు ఇచ్చిన కారణంగా, మా రౌతులపూడి దేవుడు రామలింగడు ఊరేగింపుకి బయలుదేరితే, ముందుగా బలరామపురం వెళ్ళి ఊరేగి వచ్చేకనే, మా ఊళ్ళో ఊరేగేవాడట. అతి పురాతనమైన ఈ గుడిని, ఈ మధ్యనే తిరుమల తిరుపతి దేవస్థానంవారి సహకారంతో పాటుగా, గ్రామపంచాయితీ ప్రెసిడెంట్ పైల సాంబశివగారి ఆధ్వర్యంలో, ఊరివార్ల సహకారంతో తిరిగి నూతనంగా నిర్మిచబడుతోంది. అలాగే మా ఊరి గ్రామదేవతలైన చిన వేములమ్మ , పెద్దవేములమ్మలు ఊరు మొగదలనేవుండి, ఊరు సుభిక్షంగా వుండేలాగ అనుగ్రహిస్తూ వున్నారు. అలాగే కనకదుర్గ అమ్మవారుకూడా ఊరివారి పూజలందుకొంటూ, నిత్యనూతనంగా విలసిల్లుతూ వుంది.

ఇప్పుడు హైస్కూల్, బ్యాంక్ ,సినీమా హాల్ , రైస్ మిల్స్ , పెట్రోల్ బంక్స్, షాపింగ్ మాల్స్, మెడికల్ షాప్స్, మందుబార్స్ (వైన్ షాప్) మొదలైన వాటితో ఎంతో అదునాతనంగా, మండలకేంద్రంగా మారిన మా రౌతులపూడిని చూస్తే ఆశ్చర్యంగా వుంటుంది. ఒకప్పుడు నేనుపెరిగన నా ఊరేనా అని నేను ఆశ్చర్యపోతూవుంటాను.
అంతగా మారిపోయింది మా రౌతులపూడి.

పెద్దాపురం సంస్థానానికి చెందిన భూములను సత్రం భూములంటారు. పెద్దాపురం సంస్థానంలో చివరి రాజులగు వత్సవాయివారు నిస్సంతులవడంవలన, బ్రిటిష్ ప్రభుత్వం వాటిని స్వాధీనముచేసుకోగా, బ్రిటిష్ పాలకుల ఆగడాలకు లోనుకాగలనని భయపడిన రాణీ తన ఏడువారాలనగలనూ, ప్రజల అవసరార్థం ఖర్చు చేయమని , తమవద్ద మంత్రిగా పనిచేస్తున్న మూడు మూరల సాహెబ్ అనిపిలువబడే ఆజానుబాహుడైన, నమ్మకస్తుడైన అతడికి అప్పగించి, బ్రిటిష్ పాలకుల పాలబడకుండా, తప్పించుకొని ,నూతిలోపడి , ఆత్మహత్య చేసుకొన్నారుట. తరువాత ఆ సాహెబ్ మంత్రిగారు, ఒంటిమామిడి లోగల ఎర్రమిల్లి వారికి, నగలను నగదుగా మార్చి, కాశీ మొదలగు పుణ్యక్షేత్రాకు వెళ్ళే ప్రయాణీకులకొరకు వినియోగించమని కొంతధనమిచ్చి, మిగిలినధనంతో, బాటసారులకు అన్నదాన సత్రాలుగా కట్టించాడు. అలాంటి సత్రమే మనం నేటికీ, కత్తిపూడి జాతీయ రహదారిలోగల ‘వత్సవాయి రాణీ బుచ్చెయ్యమ్మ అన్నదాన సత్రవ’ న్న పేరుతో వున్నది చూస్తూవుంటాం. కత్తిపూడిలోనేగాక, పెద్దాపురం, తొండంగి, రాజానగరాలలో నేటికీ మనం చూడవచ్చును ఇలాంటి సత్రవులు .

మా రౌతులపూడిలో నిన్నమొన్నటివరకూ, పాతకరణంగారు అనిపిలువబడే, మా నాన్న కొండ్రాజుగారు, కుటుంబతగాదాలూ,భూతగాదాలూ మొదలైనవి పరిష్కరిస్తే, పైల అబ్బాయినాయుడుగారు, చిన్నచిన్న ఊరితగాదాలను పరిష్కరించి, ఊర్లో పోలీసువారి అవసరంకలుగకుండా చూచేరు.

అలాగే ప్రజానటుడు, వివాద రహితుడు, నిరాడంబరుడు, కార్మిక , కర్షక పక్షపాతి అయినటువంటి సినీ ఏక్టర్ రెడ్డి నారాయణమూర్తి మాఊరివాడని చెప్పుకోవడానికి మా ఊరివారమంతా గర్వపడతాం. తన పేరుకూడా పెట్టడానికి ఇష్ణపడని ఆ నిగర్వి ,ఊరిమధ్యలో, నాలుగెకరాల భూమిని కొని ఆ స్థలంలో ప్రజావైద్యశాలను నిర్మించి, దానిని ప్రభుత్వ ఆసుపత్రిగా మార్చి చిరయశస్సును సంపాదించుకొన్నారు. ఈ వైద్యశాలలో ప్రభుత్వ వైద్యునిగా పనిచేసిన , నొక్కు దయానందరావుగారు, మిలటరీలో వైద్యునిగా అప్పటివరకూ పనిచేస్తున్న ఆయన వాలంటీ రిటైర్ మెంట్ పెట్టుకొని, స్వంత ఊరికీ, స్వంత ప్రజలకూ సేవచేయాలని నిశ్చయించుకొని ఈ ప్రజా వైద్యశాలకు తమ అమూల్యమైన సేవలు అందించి, ఎన్నో ప్రాణాలు నిలబెట్టేరు.

మా రౌతులపూడి ప్రజలు ఆడా మగాకూడా, కష్టజీవులు. ఆడవారు కుట్టినమిషనుకుట్టులాంటి సన్నని చీపురు పుల్లలు ఈనెలుగాచేసికుట్టిన, అడ్డాకుల విస్తళ్ళకు ఆధ్రరాష్ట్రంలో మంచిగిరాకీవుంది. అలాగే మారైతులు పండించిన కూరగాయలకు ముఖ్యంగా పచ్చిమిర్చి, చిక్కుడు, వంకాయలు, దబ్బకాయలూ, అరమీటరు పొడవుండే బీరకాయలకు ఆధ్రప్రదేశ్ లోనేగాక ఇతతరరాష్ణ్రాలలోకూడా మంచి ఆదరణవుంది. మా రౌతులపుడిలో వారాంతపు సంతలో కోటీ ఎభైలక్షలమేర విక్రయాలు జరుగుతాయని సగర్వంగా చెప్పగలను.

మా ఊరి వడ్రంగులు మంచి కర్ర పనితనంగలవారు. సోపా సెట్లూ, పందిరి మంచాలూ మొదలైనవాటినుండి, ఎంతో అందంగా ఇంటికి కావలసిన ఫర్నీచర్ తయారుచేయగల నేర్పరులు. అందుకనే, ఈ కులంలోని యువకులనందరూ దేశంలోని వివిధ ప్రాంతాలకు పనులనిమిత్తం కోరి మరీ, తీసుకొనివెళతారు. ఇక్కడకి సమీప కొండలలో’ ‘రంగురాళ్ళు’అని పిలువడే అతి విలువైన వజ్ర వైఢూర్యముల వంటి రాళ్ళు లభిస్తాయి. వాటి సేకరణ మూలంగానే, మా రౌతులపూడి ప్రజలు సుఖ సౌఖ్యాలతో తులతూగుతున్నారని, అందరూ అనుకొంటూవుంటారు. అలాగే, మా రౌతులపూడి ఆనుకొని వున్న కొండలన్నీ నేడు క్వారీలుగా మారి, కాంట్రాక్టర్లకూ, రాజకీయనాయకులకూ కోట్లాది ధనాన్ని సంపాదించి పెడుతున్నాయి.
ఇక అన్నవరంక్షేత్రంలో కన్నులవిందుగా కనిపించే పంపా రిజర్వాయర్ కి నీరు ,మా ఊరి ని ఆనుకొనివుండే కొండలనుండే, జలధారలుగా జారి, సెలఏరుగా మారి, ఉత్తరవాహినిగా పుట్టి, రైతులపూడినుండి తూర్పు దిక్కుగా ప్రవహించి, చుట్లు పట్ల అనేక గ్రామాల పంటచేలను సస్యశ్యామలం చేస్తూ, అన్నవరం సత్యనారాయణ స్వామివారి పాదలచెంత, రిజర్వాయరుగా మారి,ఆ క్షేత్రంలో స్వామివారి తెప్ప తిరునాళ్ళమహోత్సవానికి ఉపయోగపడుతూ, జన్మపండించుకోవడమేగాక, దిగువనవున్న మరిన్నిగ్రామాలప్రజలకు, అన్నాధారామౌతోంది.
ఇంక మాఊరితో నా అనుబధం గురించి ఎంతచెప్పినా, మాఊరి చెలమలలోని, తియ్యని నీటిలా ఊరుతూనే వుంటుంది.

ఒకప్పుడు పాతికమందికిపైగా కరణాలకు ఆవాసంగావున్న మాఊరు, ఇంటి ఒక్కింటికీ, పది పన్నెండుమందికి తక్కువకాకుండా కలిగిన సంతానంతో, మా కరణాలవీధి కలకల్లాడుతూవుండేది. ప్రతి ఇంట్లో పాడి పంటా సమృధ్ధిగా వుండేది. మా బడిసమయమైపోయేకా, మా సత్యం మావయ్యగారింటి ఎదురుగావుండే ఖాళీ స్థలంలో , ఆడపిల్లలు ,మగపిల్లలు అన్నతేడా లేకుండా ఆటలకు దిగితే, వీధి మా కేరింతలతో మారుమోగిపోయేది. సత్యంమావయ్య గారి అన్నగారు పెదవెంకటరావు మావయ్య కాస్త మోటు మాటలాడేవాడు. అందుకనే ఆయన మీద కోపంతో,ఆయనకి పళ్ళు ఊడిపోయినకారణంగా బొక్కితాత అనే నిక్ నేమ్(మారుపేరు) కూడా పెట్టి ఏడ్పించేవాళ్ళం.

అలాగే మాజట్టులో కొంచెంపెద్దవాడైన మా శేషగిరి బావ దర్శకత్వంలో,రామాయణ, భారతాల్లోని కథలను చిన్న చిన్న నాటకాలుగా ఆడేవాళ్ళం. మా ఊరి టూరింగ్ సినీమాఆపరేటర్ కట్ చేసిపారేసిన, పిలింముక్కలను ఏరుకొని తెచ్చి, వాటిపైన బేటరీలైట్ తో కాంతి పడేలాచేసి,మా తాయారొదినగారి చీకటిగదిలో శేషగిరి, వాటిని ‘”సినీమా చూపిస్తా”నంటూ, గోడమీద బొమ్మలేసిచూపించేవాడు. ఆ బొమ్మలు చూసి, మేమంతా నిజంగా సినీమా చూసినట్లే ఫీలైయ్యే వాళ్ళం. బంధుత్వాలు దూరమైనా,దగ్గరైనా, అందర్నీ వరుసలు కలిపి పిలుచుకొనేవాళ్ళం మేము ఆరోజూల్లో. ఇదంతా ఎన్ .టీ. రామారావు చీప్ మినిష్టర్ గారాని (ముఖ్యమంత్రి కాని) ముందర సంగతి. ఆయన వస్తూనే చేసిన మొదటి సంతకం ‘కరిణీకాల రద్దు’ .అంతే కరణాల ఉద్యోగాలు పోయి, గంపెడుమంది పిల్లలుగల కరణాల స్థితిగతులు, ఒక్కసారిగా, చిన్నాభిన్నమై, ఉన్నఊరొదిలి, చెల్లాచేదురుగా, బ్రతుకు తెరువు వెతుక్కొంటూ,ఊర్లు పట్టుకు వెళ్ళిపోయేరు. ఊరు చిన్నబోయింది.ఇళ్ళు పాడడ్డాయి. మా ఊరి మనసులు మూగబోయేయి.

మా ఊరిలో ముందుగా చెప్పుకోతగ్గ రైతు గాడి ఎల్లయ్యగారని చెపుతారు ఎవరైనా. ఇంగువకట్టిన గుడ్డలా ఆయన పోయి అరవై డభ్భై ఏళ్ళైనా ఆయనపేరు ఇంకా మా ఊరిలో వినిపిస్తోందంటే,ఆయన దానగుణమనే చెప్పాలి. ఆయన బ్రతికున్నన్ని రోజులూ, ఏకులంవారికీ, ఆకలిబాధ లేకుండా నిరతాన్నదానం చేశారుట. గిన్నెపట్టికెళితే గిన్నెనిండా పట్టినంత అన్నంతెచ్చుకొని పిల్లాపాపా తిని , అప్పట్లో వచ్చిన కరువును జయించారుట.
సిరిసంపదలకు నిలయమైన ఆయింట్లో ఒక గదిలో గోడల మేకులకు బంగారు వస్తువులైన, కంటెలు, కాసులపేర్లూ, వడ్దాణాలు పలకసరిపేటలూ, చంద్రహారాలు మొదలైనవి వేళ్ళాడుతూ వుండం నేను అనేకసార్లు చూశాను. అలాగే మరోగదిలో ఇత్తడిసామాను, మరోగదిలో రాగిసామాను కూడా నిలువెత్తుగా నిలబడివుండేవి. అలాగే అనేకగదులలో, నగిషీలు చెక్కిన, నిగనిగలాడే పందిరి మంచాలుండేవి. అనేకమంది పనులు చేసే పనివాళ్ళతో వారి లోగిలి, కలకలలాడుతూవుండేది. అయితే సిరి ఒకచోట నిలవదన్నది నిజమన్నట్లు, అనేకానేక కారణాలవల్ల ,కరణాలకుటుంబాల లాగునే గాడివారి సిరికూడా, చెల్లాచెదరైపోయింది.
గాడెల్లయ్యగారి తరువాత ఆ ఊరిలో చెప్పుకోతగ్గ కామందు మానాన్న. మా ఇల్లుకూడా,ఎప్పుడూ వచ్చే,పోయే చుట్టాలతో కలకలల్లాడుతూవుండేది.

మాకు గోసంపద హెచ్చుగావుండేది. మా పశువులను ఒక పొలంనుండి , మరో పొలంమారుస్తున్నప్పుడు, ఊర్లోవాళ్ళ పనిపాటలకు ఇబ్బందికలక్కుండా, ముందురోజే “రేపు కరణంగారి పశువులు పొలంమారుతున్నాయికనుక, ఫలానా సమయంనుండి, ఫలానా సమయంవరకూ బయటకు రావద్దండహోయ్ !” అని బారిక వాడు టముకేసేవాడంటే ఎన్ని పశువులుండేవో ఊహించండి.

మాఇంటికి మజ్జిగ , పాలకోసం ఉదయం ఆరుగంటలనుండీ జనాలు వస్తూవెళుతూ వుండేవారు. మా అమ్మ చేతిచలువమంచిదని , బాలింతరాలికి పత్యం పెడుతున్నామంటూ ,రోజూ ఎందరో వచ్చి,పాతబియ్యం మొదలైన పత్యపు సరుకులు పట్టికెళుతూండేవారు. కొంచెం కాటుకెట్టండీ, కొంచెం కుంకుమెట్టండి, కూరకేదైనా పెట్టండంటూ అమ్మనడగడానికి ఎవరెవరో ఎందరో వచ్చేవారితో తిరునాళ్ళంత హడావిడిగా వుండేది మాఇల్లు. టీకాల్ ఇనస్పెక్టర్, తాహసీల్ దారు మొదలైనవాళ్ళు ఊళ్ళోకొస్తే భోజనాలు మా ఇంట్లో పెట్టేవారు. టీకాలినెస్పెక్టర్ వస్తే, ఆయన వెళ్ళేదాకా,మా పిల్లలం కిమన్నాస్తి. ఎక్కడ టీకాలేస్తానంటోరని హడలిపోయి మంచాలకిందా కుంచాలక్రిందా దాక్కునేవాళ్ళం. ఆయన ఊరొదిలి వెళ్ళేకానే మళ్ళీ బళ్ళోకెళ్ళడం చేసేవాళ్ళం. అదేమిటొకానీ, మా ఇంట్లోవాళ్ళుకూడా బడికెళ్ళమని గద్దించేవారేకాదు. టీకాలినస్పెక్టరేకాదు, ఊళ్ళోకి మందులాళ్ళొచ్చి, ఏములమ్మతల్లి గుడిదగ్గర మకాంచేశారని తెలిస్తేచాలు ,వాళ్ళు ఊరొదిలి పోయేదాకా వీధిమొఖం చూసేవారముకాదు.అలాగే మూర్చవాళ్ళమంటూ, మొలకు చిన్నగుడ్డకట్టుకొని,అట్టకట్టిన జుట్టు విరబోసుకొని, అసహ్యమైన గుడ్డను తలకు చుట్టుకొని, చేటల్లో చంటిపిల్లల్లల్ని పెట్టుకొచ్చేవాళ్ళు, మా ఊర్లోకి దిగబడినా ,భయంతో బడి మానేసేవాళ్ళం.
మరీ బడి ఎక్కువరోజులు మానేస్తేమటుకు మా సూర్రావు మాష్టారు ,కాకాకూకాయ్ అని ‘కాభాష’ మాత్రమే మాట్లాడగలిగే అతడినీ, ఇంకో ఇద్దరు ముగ్గురు కుర్రాళ్ళనీ పంపించేవారు.వాళ్ళప్పటికి నాలుగో, ఐదో చదివేవారు కానీ,నిజానికి వాళ్ళకి ఇంటరో,డిగ్రీలో చదవాల్సిన వయసుండేది. వాళ్ళు బలవంతంగా చేతులమీదకెక్కించుకొని, సాయంబట్టి, మేమెంతగించుకొంటున్నా తీసుకుపోయి బళ్ళో పడేసేవారు.

అయితే ఇక్కడొకమాటచెప్పాలిమీకు.ఐదోతరగతైనా, చేటంత పలక మాత్రమే పట్టుకొని బడికెళ్ళేవాళ్ళంకానీ ,ఒక్కటంటే ఒక్కపుస్తకంకూడా మాకుండేదికాదు.మా మాష్టర్ల దగ్గరమాత్రం, తెలుగుకి ఒకపుస్తకం, లెక్కలూ, సైన్సూ, సోషలుకీ కలిపి ఒక పుస్తకంవుండేవి.
లెక్కలన్నీ నోటిలెక్కలే అడిగేవారు. తెలుగు పాఠం కథలుగా చెప్పి, ప్రశ్నలడిగి,వర్ణక్రమంతో చదువుతూ రాయమనేవారు.

అలా పుస్తకమేనా కొనకుండానే, ఐదోతరగతి పూర్తిచేసిన అమ్మాయిలం ఇంటి పట్టున వుండేవాళ్ళం. కుట్లు ,అల్లికలూ మొదలైనవి నేర్చుకొంటూ, అత్తిటికెళ్ళేవరకూ కాలక్షేపం చెయ్యడమే! అయితే మాఇంట్లో,నా అదృష్టంకొద్దీ ,మా అన్నయ్య ,’విశాలాంధ్రావారి ఇంటిట పుస్తకం’ అన్నపథకానికి డబ్బు కట్టి, నెలకీ ముఫ్ఫై నలభ్భై పుస్తకాలు పోష్ట్ ద్వారా తెప్పించేవాడు. మా పక్కింటి రాజు మావయ్య కూడా అదే విశాలాంద్ర వారిపుస్తకాలు వేరే వేరేవి తెప్పించేవాడు. అవీ ,మా అన్నయ్య తెప్పించినవీ, మొత్తంగా బోల్డు, బోల్డు మంచి, మంచి పుస్తకాలు చదివేసేదాన్ని నేను.

మాకు మరో మంచి కాలక్షేపం మా మర్ఫీ రేడియో!
ఎంతోమంచి మంచి కార్యక్రమాలో వచ్చేవి దానిలో. మా నాన్నకనుక ఊళ్ళోవుంటే, ఉదయంవార్తలు చాలా శ్రధ్ధగా వినేవారు.నాకిప్పటికీ,”వార్తలు చదువుతున్నది కొంగర జగ్గయ్య”అనో, లేదా వార్తలు చదువుతున్నది పణ్యాల రంగనాధరావు “అనో వారి గాంభీరమైన గొంతులు వినిపిస్తున్నట్లే అనిపిస్తుంది. మిగిలిన సమయమంతా, రేడియో ప్రసారాలొస్తున్నంతసేపూ రేడియో ఆన్ లో వుండవలసినదే! మాకదే గొప్పకాలక్షేపం. రేడియోలో విని, వ్రాసుకొని, ఎన్నోలలిత గీతాలు, దేశభక్తిగీతాలూ నేర్చుకొన్నాను నేను.

శ్రీరామనవమి నాడు రేడియోలో వచ్చే,సీతారామకళ్యాణం వినడానాకి,మా ఊరి పురోహితుడు , సోమసుందరం తాతగారుకూడా వచ్చేవారు. ఆయన గొప్ప సంగీత విద్వాంసులట. సహజకవి, జ్యోతీష్కులు అయిన ,మా తాతగారు పూళ్ళసత్యనారాయణమూర్తిగారికి ఆప్త మిత్రులు. సోమసుందరంగారు ,కాకినాడ లోగల శ్రీరామ సమాజం వ్యవస్థాపకులు, మునుగంటి శ్రీరామమూర్తిగారి తండ్రిగారైన, వెంకటరావుగారికి సహా ద్యాయులని, మునుగంటి శ్రీరామ్మూర్తిగారు ,వారి నాన్నగారిగురించి వ్రాసిన పుస్తకంలో, మా చిట్టెం సోమసుందరం తాతగారి గురించి వుందని, ఈమద్యనే తెలిసింది.

మా సోమసుందరం తాతగారి దగ్గర సంగీతం నేర్చుకోవాలనే జ్ఞానం అప్పట్లో మాకు లేకపోయింది కానీ, మంగలి పడాల చిన్న అప్పలస్వామి సంగీతాన్ని ఆయనదగ్గర నేర్చుకొని, దాన్ని షహనాయ్ మీద పలికించి, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో,సన్మానాలూ,సత్కారాలూ పొందేడు.
ఇక్కడ మళ్ళీ మా తాతగారు పూళ్ళ సత్యనారాయణమూర్తిగారి గురించి చెప్పాలి.ఆజానుబాహులు, స్పురద్రూపి, తిరుపతి వేంకటకవుల సహపాఠి, బంధువు అయిన మా తాతగారు ముందులో చెప్పినట్లుగానే మంచి జ్యోతీష్కులు .

ఆయన జ్యోతీష్యాన్ని పరీక్షించాలని,ఆయనవియ్యంకుడు ,జొన్నలగడ్డ నరసింహ మూర్తిగారు, “బావగారూ! మా కర్రావు,ఇన్నిగంటల,ఇన్ని,నిమిషాల, ఇన్ని సెకనులకు ప్రసవించింది.అది ఆడ పెయ్యా!లేక కోడెదూడా ?తెలుపవలసింది “అని ఉత్తరం వ్రాసేవారట. మా తాతగారూ,ఆ దూడకు జాతకచక్రము వేసి, అది ఆడదో మగదో,దాని రంగేమిటో,దానికి ఎన్ని మచ్చలు, ఎక్కడెక్కడవున్నాయో,ఎన్ని సుడులు వున్నాయో కూడా తెలిపేవారు. అలాగే ఊరిలోవారు,”వేసవి ఎండను భరించలేక పోతున్నామయ్యా! వర్షంపడడానికి ఏదైనా ఒక పద్యం అందుకోండి అని ప్రాదేయపడితే, ఆయన పద్యంపూర్తయ్యే లోపుగా వాతావరణం చల్లబడి, చినుకులు పడేవిట. ఆ విషయాలు మాతాతగారు చనిపోయి అరవై సంవత్సరాలు దాటిపోయినా, మా ఊరివారు ఈనాటికీ చెప్పుకొంటారు.

ఇక మళ్ళీ చదువుల ప్రసక్తిలోకొస్తే, అబ్బాయిలుమటుకు ఊళ్ళో హైస్కూలు లేదుగనుక, ఏడుమైళ్ళదూరంలోవున్న శంఖవరం వేళ్ళేవారు అప్పట్లో. కొందరు నడిచి, కొందరు సైకిళ్ళమీదా వెళ్ళిచదువుకొని వచ్చేవారు.ఆ తరువాత పైచదువులకు బంధువుల ఇళ్ళకూ,హాస్టళ్ళకీ గీష్టళ్ళకీ అంటూ వెళ్ళి విడిపోయేవారు. మళ్ళీ,పండగో, పబ్బమో ,లేదా వేసవి సెలవల్లోనే అందరూ కలవడం, సెలవలయిపోయేకా, మళ్ళీ ఎక్కడివాళ్ళక్కడకి వెళ్ళిపోయేవారు. నాకు తెలిసి మా ఊర్లో నా సహాద్యాయులు చిట్రాప్రగడవాళ్ళ అబ్బాయిలు,పేర్రాజు, భాస్కర్రామం, బుచ్చిరాజు తాతగారి రామం ,వివిధరకాలైన సైనికులుగా, వివిద హోదాల్లో పనిచేసి దేశమాత ఋణం తీర్చుకొన్నారు. మా శేషగిరి బావమటుకు సైనిక పాఠశాలలో ఉపాద్యాయుడుగా పనిచేసి, రిటర్ అయ్యి ,విశ్రాంత జీవితం గడుపుతుంటే, రామంమటుకు, రిటైర్ మెంట్ తర్వాత, జ్యోతీష్య శాస్త్రంలో పట్టభద్రత పొంది, హైదరాబాద్ లో మంచి జ్యోతీష్కుడుగా పేరు సంపాదించాడు.

మా రౌతులపూడికి వన్నె తేగల మా బుల్లినాన్న కొడుకు, మాతమ్ముడు, ళ్ళసత్యనారాయణమూర్తి, (మూర్తి)మృదంగ విద్వాన్, ఆలిండియా రేడియో ఆర్టిష్ట్ ,గోల్డ్ మెడలిష్ట్ అతిచిన్నతనంలో గొప్ప పేరు సంపాదించుకొని, అతి చిన్నతనంలో చనిపోవడమన్నది మా కుటుంబానికేగాక, ఊరు రౌతులపూడికే కలిగిన గొప్పలోటు.

ఏది ఏమైనా, మా ఊరు అన్ని పల్లెటూర్లలాగానే బాగా అభివృధ్ధిచెందింది. పేదతనమన్నది ,మా రౌతులపూడి చుట్టుప్రక్కల కనిపించదు. గ్రామస్తులందరికీ ,ఎంతో కొంత భూమి వుంది. చాలా మంది మంచి మంచి వ్యాపారాలు పెట్టుకొని, సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.

మరికొందరు యువతీ యువకులు మటుకు గవర్నమెంటు కల్పించిన సదుపాయాలతో, అన్నికులాలవారూ చదువుకొంటున్నారు. అయితే, బాగా శ్రధ్ధగా చదివినవారు ఉద్యోగస్తులైతే, బాగా చదవనివారు మటుకు, ఇటుఉద్యోగాలూరాక, కులవృత్తులూ చేయక, చేయడం చేతగాక, సోమరులై, దురభ్యాసాలపాలై, తమ తల్లితండ్రులు కష్టించి సంపాదించుకొన్న ధనం పాడుచేస్తూ, అనవసర రాజకీయాలలో పాల్గొని, ఊరిని ఆగం ఆగం చేస్తున్నారు.

చాలా గ్రామాలలో లాగునే మా రౌతులపూడిలో కూడా స్త్రీల కట్టూబొట్టూలలో మార్పేకాకుండా, పని సంస్కృతి కూడా పోయింది. టీ.వీ సీరియల్స్, ఫోన్ చాటింగులకీ అలవాటుపడి, ఆరోగ్యం, ధనం పాడుచేసుకొంటున్నారు. ఆప్యాయతలు కరువై, ధనానికి విలువనివ్వడం పెరిగింది. నిజానికి పల్లెటూరైనా, నాగరీకత ప్రభావం మా పల్లె రౌతులపూడిపైన బాగా పడింది. ఇది తలచుకొంటే మటుకు నా మనసుకు చాలా బాధకలుగుతుంది.

తమదైన సంస్కృతిని వదిలి, కులవృత్తులను వదిలిపెట్టి, ప్రతిదానికీ పట్టణాలను అనుకరిస్తున్నప్పుడు, పల్లెలను పల్లెటూర్లు అనడం కూడా అనవసరమేమో అనిపిస్తూవుంటుదినాకు.

రచన: సత్యవాణి కుంటముక్కుల

DISCLAIMER: The author is solely responsible for the views expressed in this article. The author carries the responsibility for citing and/or licensing of images utilized within the text.