మాఊరు మాఊరేనా
మారిపోయిందేమిటిలా
ఓ….హో…అని అరిచే
అద్దరికి వినిపించే ఆ అరుపులేవి
ఆహో…..యయ్ అని అరచే
ఇద్దరి జవాబులేవీ
కుమ్మరి గంగన్న
కుండలపై చరిచే
చెక్క చప్పుళ్ళేవి
కమ్మరి సోమలింగం
కమ్మరిశాలలో
కమ్మరంలో వినిపించే
సుత్తి చప్పుళ్ళేవీ
తూతిక వాళ్ళింట్లోంచి
టిక్ టక్ టిక్ టక్ మని వినిపించే
మగ్గం చప్పుళ్ళేవి
పంచముల వాడనుంచి
వినిపించే
తాటిమట్టలనుండి నారతీసే
టక టక్ టక్ చప్పుళ్ళేవి
చాకి రేవులో వినిపించే
హిస్సు హస్సు హిస్సు హస్సమని వినిపించే
లయబధ్ధమైన  శబ్దాలేవీ
మంగలప్పలసామి
సన్నాయి రాగాలేవీ
పల్లకీబోయిల
అహోం  ..ఒహోం ..అహోం..
అహోం … ఒహోం.. శ్రమగీతాలేవీ
చేలల్లో అలుపు తెలియకుండాపాడే
ఆడ కూలీల జానపదులేవి
అర్థరాత్రి కుప్పనూర్పుల్లోపాడే
హరి హరీ నారాయణో
ఆదినారాయణో అనే
అప్పన్నగీతాలేవి
పిల్లకాయల మారాము
నసుగుడు  ఏడుపురాగాలేవి
ఒలే …ఒసే…ఓలమ్మీ అనే
ఆప్యాయత పలకరింపులేవి
రోకలి దంపుల దరువులు ఏవీ
దంపుడు పాటల మెప్పుళ్ళేవీ
పశుల గిట్టల చప్పుళ్ళేవీ
పంతుళ్ళ పవిత్ర మంత్రాలేవీ
రామకోవెళ్ళ చెక్కభజనలేవీ
రాత్రి వెన్నెలలో పిల్లల ఆటపాటలేవీ
ఏవీ   ఇవన్నీ
ఎక్కడా వినిపించవేం
ఎందుకు ఊరిలా నిశ్శబ్దంగా మారిపోయింది
అసలిది నా ఊరేనా
నాదని పొరపడుతున్నానా

రచన:సత్యవాణి కుంటముక్కుల

DISCLAIMER: The author is solely responsible for the views expressed in this article. The author carries the responsibility for citing and/or licensing of images utilized within the text.