కమల స్నేహితురాళ్ళతో కలసి కిలకిలా నవ్వుతూ గబగబా తోటలోకి వచ్చింది.అప్పటికే బడికి సెలవుదినం కావున, అక్కడ పిల్లలతో తోట కిటకిటలాడుతోంది. తోట ప్రక్కనున్న పట్టాలపైనుండి రైలు దడదడ శభ్దంచేసుకొంటూ రయ్ రయ్ మని దూసుకు పోతూ కూకూ అంటూ కూతపెడుతూ వెళ్ళిపోయింది. దూరంగా రైల్వే స్టేషన్లో నుండి, మరో రైలుకోసం గంటలు ఠంగు ఠంగున కొట్టేరు. తోటలో ఎండి రాలిన ఆకులు పిల్లల కాళ్ళక్రిందపడి గలగలమని చప్పుడు చేస్తూ టపటపమని విరిగి పోతున్నాయి.

ఎండాకాలము ఎండ బయట భగభగ మండుతున్నా, తోటలో మాత్రం చల్లచల్లగా హాయి హాయిగావుంది. ఎవరికీ ఒళ్ళు చిరచిరలాడటంలేదు. చెట్టు కొమ్మల్లో కూర్చున్న కొన్ని పిట్టలు కువ కువలాడుతున్నాయి. కోయిలమ్మ కూడా కుహు కుహు అని తియ్య తియ్యగా పాడుతుంటే, పిల్లలందరూ కూడా సరదా సరదాగా కోయిలమ్మతో గొంతు కలిపి కుహు కుహు అని అరచారు.

ఈ పిల్లలల్లరికి తోటమాలి విసవిసా నడుస్తూవచ్చి, కొరకొరా చూస్తూ, కర్ర పట్టుకొని, బిరబిరా రావడం చూసిన పిల్లలు, గుసగుసగా మాట్లాడుకొని, పక పకా నవ్వుకొంటూ, మాలికి అందకుండా గబగబా పద పదమంటూ, అక్కడనుడి పరుగు పరుగున పారిపోయారు.

తోటమాలికి కోపంతో ఒళ్ళు భగ భగ మండి పోయినా, చేసేదేమీ లేక తపతపమని నడుచుకొంటూ కోపంతో చిరచిరలాడుతూ, వెనుదిరిగి గబగబా వెళ్ళి పోయాడు.

(పిల్లలూ! నేను మరచిపోయి మరేమైనా జంట పదాలను వదిలిపెట్టానేమో చూసి చెప్పండి.)

రచన – కుంటముక్కల సత్యవాణి

DISCLAIMER: The author is solely responsible for the views expressed in this article. The author carries the responsibility for citing and/or licensing of images utilized within the text.