కృష్ణదేవరాయలు మరియు పృథ్వీరాజ్ చౌహాన్లలో ఎవరిని భారతదేశం అనుసరించాలో అడిగితే, మీరు ఎవరిని ఎన్నుకుంటారు?

వారిరువురూ వారి వారి దేశకాల పరిస్థితుల పరిణామాలకు అనుగుణంగానే ప్రవర్తించారు. ఒకరికి, యుద్ధనీతిని పాటించడం ధర్మమైతే, మరొకరికి తన ప్రజల రక్షణ మరియు భద్రతే ధర్మం. వారు మనకు ఏ పాఠాలు నేర్పుతారు, మరియు ఇద్దరూ ప్రవర్తించిన విధానం నుండి భారతదేశం ఏమి నేర్చుకోవచ్చు?

ఆ ఇద్దరూ తమ తమ దేశకాల పరిస్థితుల చేత ప్రభావితమై వాటికి బద్ధులైన వారే. వారి చర్యలు ఆయా దేశకాల పరిస్థితులే పరిణామాలే. గట్టు మీద నిలబడి మాట్లాడటం చాలా సులభం. కానీ, మీరు విశ్లేషించే వ్యక్తి యొక్క స్థానంలో మీరు ఉంటే, మీకు పూర్తిగా భిన్నమైన చిత్రం కనిపిస్తుంది. పృథ్వీరాజ్ చౌహాన్ లేదా కృష్ణదేవరాయ ఇద్దరూ వారి దేశకాల పరిస్థితుల పరిణామాలే అనే కోణంలో నుండి చూస్తే వారు ప్రవర్తించిన విధానం ఆశ్చర్యంగా అనిపించదు.

ఉదాహరణకు పృథ్వీరాజ్ చౌహాన్ ను చూడండి, ఆయన పాటించిన విధానం వలననే ఇస్లామిక్ దండయాత్రలకు భారతదేశం తలుపులు తెరిచినట్లైందనే తీవ్రమైన ఆరోపణలకు గురయ్యాడు. కానీ, నిజంగానే అలా ఊరికే ఆరోపించవచ్చా? ఆయన ఒక గొప్ప రాజపుత్ర వంశంలో జన్మించాడు. ఆయన చేసిన యుద్ధాలన్నీ ఆయనలాగే శరణాగత రక్షక శౌర్య పరాక్రమాలు గల తోటి రాజపుత్ర పాలకులతో జరిగాయి. వారందరూ యుద్ధనీతిని అనుసరించి పోరాడినవారే. వారిలో ఎవరైనా యుద్ధనీతిని పాటించకపోవడం వారు కలలో కూడా తలచని విషయం. ఒక రాజు యుద్ధంలో పట్టుబడి శరణు వేడుకుంటే ఆ రాజుని విడుదల చేసి అతని ఆస్తులను తిరిగి ఇస్తారు. అతను మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తాడని సందేహించవలసినక్కర్లేదు. పృథ్వీరాజ్ చౌహాన్ పాలించిన భూభాగానికి ముస్లింల గురించి తెలియదని కాదు. సింధు (ముస్లింల పరమైపోయి) తమ చేయి దాటిందని వారికి తెలుసు. ఇంతకు మునుపు రెండుసార్లు ఇస్లామిక్ దండయాత్రల యొక్క ఉప్పెనలు తిప్పికొట్టబడ్డాయని వారికి తెలుసు. కానీ ముస్లిం యుద్ధనీతి యొక్క చరిత్రను ఆ భూమి అప్పటికి మరచిపోయింది.

ముహమ్మద్ ఘోరీ కంటే మహ్మద్ గజినీ చాలా శక్తివంతమైనవాడు. అయినప్పటికీ, వాస్తవానికి ముహమ్మద్ ఘోరీయే ఎక్కువ సాధించాడు. ముందు తరం వాడైన మహ్మద్ గజినీ తన తరువాతి తరాల ఇస్లామిక్ ఆక్రమణదారులకు మార్గం సుగమం చేయడం వలన ముహమ్మద్ ఘోరీ ఎక్కువ సాధించడం జరగలేదు. చివరి వరకూ ప్రతీ అంగుళం కోసం మహ్మద్ గజినీతో పోరాడిన కాబూల్ హిందూ షాహీలే మహ్మద్ గజినీ ఎక్కువ సాధించలేకపోవడానికి కారణం. హిందూ షాహీల పతనం ఆకస్మికంగా జరిగిపోయింది – వారు ఖైబర్ కనుమలకు ఆవలి వైపున ఉన్న భూములను క్రీశ 1000వ సంవత్సరానికంతా కోల్పోగా క్రీశ 1015 నాటికి తూర్పున సింధు నది సరిహద్దుగా ఉన్న వారి మొత్తం రాజ్యాన్ని కోల్పోయారు. కాని, ముస్లింలతో పోరాడడంలో కాబూల్ హిందూ షాహీల అనుభవం మరియు నైపుణ్యం వారి తరువాతి వరుసలో ఉన్న భూభాగాలైన పరమార, చందేల మరియు కాశ్మీర రాజ్యాల వారికి సహాయపడింది. శత్రువులతో ఎలా పోరాడాలో షాహిలు తమకు నేర్పించడం వలన మరియు షాహీల అకస్మాత్ పతనం మూలంగా భారతదేశం లోపలి వరకూ సరైన సరఫరా మార్గాలను ఏర్పాటు చేయడానికి మహ్మద్ గజినీకీ తగిన సమయం లేకపోవడం వలనా పరమార, చందేల మరియు కాశ్మీర రాజ్యాల వారు శతృవుని దృఢంగా ఎదుర్కొనగలిగారు. సాలార్ మసూద్ యొక్క చారిత్రకత ఏమైనప్పటికీ, వాస్తవికత ఏమిటంటే, దండనాకన్‌ యుద్ధ సమకాలంలోనే భారతదేశంలో ఘజ్ని యొక్క సైన్యాలు హిందూ రాజుల చేతిలో నాశనమైపోయాయి. ఈ పరిణామం గజినీ సామ్రాజ్య పతనాన్ని శాసించింది. కానీ, ఇదంతా పృథ్వీరాజ్ చౌహాన్ పుట్టడానికి 150 సంవత్సరాల ముందు జరిగింది. పృథ్వీరాజ్ చౌహాన్ కాలానికి వాటిని ఎవరూ జ్ఞాపకం పెట్టుకోలేదు.

ముహమ్మద్ ఘోరీ దండయాత్ర చేసినప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ తనకు తెలిసిన ఏకైక పద్ధతైన రాజపుత్ర యుద్ధనీతి ప్రకారం యుద్ధం చేశాడు. కానీ, ఘోరీ ఆ యుద్ధనీతిని అతిక్రమిస్తాడని పృథ్వీరాజ్ చౌహాన్ ఊహించాడా? బహుశా కాకపోవచ్చు. కాబట్టి, పృథ్వీరాజ్ చౌహాన్ చేతిలో ఘోరమైన పరాజయం పొందిన తరువాత ఆయన క్షమాభిక్ష వలన ప్రాణాలతో తిరిగి వెళ్ళగలిగిన ముహమ్మద్ ఘోరి రెండవసారి పూర్తిస్థాయిలో దాడి చేసినప్పుడు వివిధ కారణాల రీత్యా పృథ్వీరాజ్ కు వ్యతిరేకంగా పరిస్థితి మారినప్పుడు ( పృథ్వీరాజ్ చౌహాన్ ఎందుకు ఓడిపోయాడు మరియు ఎలా మరణించాడు అనే దానిపై చాలా కథనాలు ఉన్నాయి) ముహమ్మద్ ఘోరి పృథ్వీరాజ్ యొక్క శరణాగత శూరత్వాన్ని అనుసరించి ఆయనను విడుదల చేయలేదు. పృథ్వీరాజ్ చౌహాన్ ను జీవితమంతా బంధించడమో లేదా చంపడమో చేయించి పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క మొత్తం రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ముస్లింలు భారతదేశంలోకి ప్రవేశించి స్థిరమైన స్థావరం ఏర్పరచుకోవడానికి అవకాశం దొరికింది అపుడే.

తాను నాశనమైపోయినా తన నియమాన్ని ఎప్పటికీ ఉల్లంఘించని శరణాగత శౌర్యవంతుడైన ఒక రాజు వలనే వారికి ఆ అవకాశం దొరికింది.

ఇప్పుడు, ఇంకొకరి చరిత్రను పరిశీలిద్దాం. శ్రీ కృష్ణ దేవరాయలు, బహుశా గత సహస్రాబ్దిలో భారతదేశం అందించిన గొప్ప పాలకులలో ఒకరు. ఆయన సింహాసనాన్ని అధిరోహించినప్పుడు ఆయనకు ఇరవై సంవత్సరాలు కూడా లేవు. అంతేగాక ఉచ్ఛ స్థితిలో ఉన్న బహమనీ సుల్తానుల నుండి విజయనగర సామ్రాజ్యం ప్రతీ సంవత్సరం జిహాద్ ని ఎదుర్కొంటోంది. సంవత్సరానికొకసారి నిర్వహించే  వార్షిక ఆచారంలాగా బహమనీ సుల్తాన్ మహమూద్ షా 1501లో విజయనగరానికి వ్యతిరేకంగా వార్షిక జిహాద్ ని ప్రకటించాడు. తమలో తాము కలహించుకుంటున్న తన రాజప్రముఖులను దారిలో పెట్టడం మరియు ఇంకోవైపు, ఎడతెగని దాడుల ద్వారా విజయనగర రక్షణ సామర్థ్యాన్ని బలహీనపరచి చివరికి ఆ రాజ్యాన్ని ఆక్రమించడమే లక్ష్యంగా బహమనీ సుల్తాను ఈ వార్షిక జీహాద్ యుద్ధాలను తలపెట్టాడు. వాస్తవానికి, విజయనగర సామ్రాజ్యమే అప్పటికి అంతర్గత రాజకీయాలతో తలమునకలై ఉండింది. 1509లో కృష్ణదేవరాయలు సింహాసనం అధిష్టించినపుడు పరిస్థితి చక్కబడుతుందనే ఆశలు లేవు. 1485 నుండి మూడు రాజవంశాలు మారాయి మరియు బాధ్యతలు స్వీకరించిన ఇద్దరు సైన్యాధ్యక్షులు పరిస్థితిని చక్కదిద్దేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ బలహీనమైన వారసుల పరంపర కొనసాగింది. వాస్తవానికి, కృష్ణ దేవరాయలకి కూడా సింహాసనాన్ని అధిరోహించే అవకాశం లేదు. నిజానికి ఆయన అన్నకొడుకు ఆ సింహాసనాన్ని అధిష్టించివలసినది. కానీ ప్రధానమంత్రి తిమ్మరుసు యొక్క మంత్రాంగం వలన కృష్ణ దేవరాయలు సింహాసనాన్ని అధిష్టించిగలిగాడు. బహమానీలు ఉత్తరం నుండి కబళిస్తుంటే, కళింగ రాజులు కంచి వరకు చొచ్చుకు రావడం మరియు సమీపంలోని ఉమ్మత్తూరులో తిరుగుబాట్లతో విజయనగర రాజ్యం అప్పటికి గందరగోళంలో ఉంది.

గందరగోళంలో ఉన్న విజయనగర రాజ్యం యొక్క సింహాసనాన్ని కేవలం యువకుడైన కొత్త రాజు అధిష్టించడం బహమనీలకు భారీ దండయాత్ర చేయడానికి సరైన అవకాశంలా కనిపించింది.  విజయనగర సామ్రాజ్యం మొత్తాన్ని స్వాధీనం చేసుకునేంత భారీ దండయాత్రకు దారి తీసింది. కానీ, తాను కొరకరాని కొయ్య అని కృష్ణరాయలు నిరూపించుకున్నాడు. కృష్ణ దేవరాయలు దెబ్బకు 1509లో బహమనీ సుల్తానులు తలపెట్టిన ఆ గొప్ప జిహాద్ యుద్ధమే చిట్టచివరి జిహాద్ గా మారింది. అప్పటికి ఉచ్ఛస్థితిలో ఉన్న బహమనీ రాజ్యం 1509 యుద్ధం తరువాత 20 సంవత్సరాల కన్నా తక్కువ సమయంలోనే అంతర్థానమైపోయింది.

బహమనీలు తలపెట్టిన ఆ 1509 నాటి దండయాత్ర అత్యంత దారుణంగా విఫలమయ్యింది. రాయ్‌చూర్ మరియు దేవానీ యుద్ధాలలో బహమనీ సైన్యాల సమన్వయాన్ని విజయనగర సైన్యాలు దారుణంగా దెబ్బతీయడంతో బహమనీ సైన్యాలు తిరిగి తమ రాజ్యానికి పారిపోవడం మొదలుపెట్టాయి. విజయనగర దళాలు వారిని వెంబడించి చెల్లాచెదురుగా నాశనం చేశాయి. ఈ ప్రక్రియలో బహమనీ సామ్రాజ్యం యొక్క రాజప్రముఖుడు మరియు బీజాపూర్ సామ్రాజ్య వ్యవస్థాపకుడు అయిన యూసుఫ్ ఆదిల్ షా విజయనగర సైన్యాలకు పట్టుబడే ప్రమాదంలో పడ్డాడు. రాయచూర్ నుండి కోవిల్కొండ దాకా 100 కిలోమీటర్ల దూరం వరకు అతన్ని విజయనగర సైన్యం వెంబడించింది. యూసుఫ్ ఆదిల్ షా యొక్క వ్యూహం పెద్ద కష్టమైనది కూడా కాదు. కోవిల్కొండ దక్షిణాదిలోని బహమనీ సామ్రాజ్యం యొక్క బలీయమైన కోటలలో ఒకటి మరియు ఇది దాదాపుగా శతృ దుర్భేద్యమైనదిగా పరిగణించబడేది. అతను చేయాల్సిందల్లా ఆ కోటలోకి ప్రవేశించి కోటను మూసివేయడమే. అతనిని రక్షించడానికి ఒక సైన్యం గోల్కొండ నుండి వడివడిగా వస్తోంది. శతృ దుర్భేద్యమైన కోవిల్కొండ కోటలో గోల్కొండ మరియు యూసుఫ్ ఆదిల్ షాల సంయుక్త సైన్యాలు తిష్టవేస్తే విజయనగర దళాలకు తిరోగమనం తప్ప మరొక మార్గం ఉండదు. కానీ, కోటలోకి ప్రవేశించకముందే విజయనగర సైన్యాల చేతిలో యూసుఫ్ ఆదిల్ షా చంపబడ్డాడు. యూసుఫ్ ఆదిల్ షా తలను శూలానికి గుచ్చి బహమనీ రాజధాని నగరమైన గుల్బర్గాలో ప్రదర్శించానని కృష్ణరాయ స్వయంగా వ్రాసుకున్నాడు.

image

ఇతర బహమనీ దళాలకు ఏ గతి పట్టింది? తీవ్రంగా గాయపడిన బహమనీ సుల్తాన్ మిగిలిన తన సైన్యంతో తిరిగి గుల్బర్గాకు పారిపోయాడు. కానీ అప్పటికే కృష్ణ దేవరాయలు బీజాపూర్ లో ప్రత్యక్షమయ్యాడు. చివరికి మహమూద్ షా శ్రీ కృష్ణ దేవరాయల ఆధిపత్యాన్ని అంగీకరించి సంధి చేసుకున్నాడు. ఈ దెబ్బతో బహమనీ సామ్రాజ్యం యొక్క ఐదుగురు ప్రధాన సామంత ప్రభువులు 1518 నాటికి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. మరియు 1527లో బారిద్ షా సింహాసనాన్ని స్వాధీనం చేసుకోవడంతో బహమనీ రాజ్యం కథ ముగిసింది.

ఇక్కడే కృష్ణరాయ తన తోటివారికి భిన్నంగా ప్రవర్తించాడు. అతను బహమనీ రాజ్యం పై వ్యతిరేకంగా రివర్స్ జిహాద్ ను ప్రారంభించాడు. గోల్కొండ గుండా కొండపల్లి మరియు కళింగ వైపుకు దూసుకుపోతున్న కృష్ణ దేవరాయల దండయాత్ర తాకిడికి వెరచి గోల్కొండకు చెందిన కుతుబ్ షా కృష్ణ దేవరాయని దారికి అడ్డు నిలిచి ఎదుర్కొనే సాహసం చేయలేదు. ముస్లింల పరిస్థితి ఎంత నిరాశాజనకంగా తయారయ్యిందంటే కృష్ణ దేవరాయల మరణం కోసం వేచి ఉండడం తప్ప వారు ఏమీ చేయలేకపోయారు. 1565 నాటికి మాత్రమే వారికి అవకాశం లభించింది. 1565లో విజయనగర పట్టణ విధ్వంసం యొక్క తీవ్రతే కృష్ణరాయలు మరియు అతని అల్లుడు రామరాయలు రాజ్యాన్ని ఎంత ప్రభావవంతంగా కాపాడుకున్నారనే దానికి స్పష్టమైన రుజువు. 1565 తర్వాత విజయనగర సామ్రాజ్యం తిరిగి కోలుకోలేనంతగా దెబ్బతినిందనేది సాధారణ నమ్మకం. కానీ వాస్తవం అందుకు చాలా భిన్నమైనది – వాస్తవానికి తల్లికోట విపత్తు జరిగిన 20 సంవత్సరాల కాలంలోనే విజయనగర సైన్యాలు గోల్కొండ కోట తలుపులు తట్టాయి.

ఇక్కడ కూడా శ్రీ కృష్ణదేవరాయలిని దేశకాల పరిస్థితుల పరిణామ కోణంలోనే పరిశీలించాలి. అతని రాజ్యం మాత్రమే కాదు, అతని నాగరికత కూడా ఒక నిర్దిష్ట విధ్వంసం వైపుకు వెళుతోంది. ఇతరులు సిద్ధం కావడానికి అవసరమైన వ్యవధి వరకు ఆ విధ్వంసాన్ని ఆపడానికి ఆయనకున్న ఏకైక మార్గం శత్రువుల మీద ఎదురుదాడి చేసి శత్రువు పద్ధతిలోనే దోపిడీ మరియు విధ్వంసం చేయడం.

పృథ్వీరాజ్ చౌహాన్ లేదా శ్రీ కృష్ణ దేవరాయల యొక్క సమకాలీనులు తమ తమ పాలకులైన వారిరువురి చర్యలను విమర్శించడం బహుశా అసాధ్యం. కేవలం పరిస్థితులకు అనుగుణంగానే వారిరువురూ నడుచుకున్నారు. అయితే, ఆ కాలం గడిచిన శతాబ్దాల తరువాత వెనుకకు ఒక్కసారి తిరిగి చూస్తే, వారిరువురి దృక్పథాన్ని ఒక్కో వాక్యంలో సంగ్రహింగా చెప్పవచ్చు.

పృథ్వీరాజ్ చౌహాన్: శతృవుకు పైచేయిని కలిగించేదైనా సరే నీ యుద్ధనీతిలో ఏ ఒక్క నియమాన్ని వదలకుండా ఖచ్చితంగా పాటించు.

శ్రీ కృష్ణ దేవరాయలు: నీ శత్రువుల పద్ధతి నీకు ప్రయోజనకారి అయితే నీ నియమాలను చెత్తబుట్టలో పడేసి నీ శత్రువు యొక్క పద్థతినే అనుసరించు.

మరో మాటలో చెప్పాలంటే, “పాకిస్తాన్‌కు మరో అవకాశం ఇద్దాం” అని పృథ్వీరాజ్ చౌహాన్ అంటే, కృష్ణ దేవరాయలు “పాకిస్తాన్‌ను నాలుగుగా విడగొట్టి, ఆ నలుగురిని తమలో తాము కొట్టుకునేలా చేద్దాం” అని అంటాడు. వారి తత్వాలను నిశితంగా పరిశీలించిన తర్వాత మనల్ని మనం తరచి చూసుకుంటే వాస్తవానికి మన ప్రయోజనానికి భిన్నంగా మనము శ్రీ కృష్ణ దేవరాయలను కాకుండా పృథ్వీరాజ్ చౌహాన్ ను అనుసరిస్తున్నాం అనే విషయం మనకు అర్థమవుతుంది. మరి ఈ రోజున మన ఆవశ్యకత (లేదా) ప్రయోజనం ఏమిటి?

పాకిస్తాన్ మరియు చైనాలను ముక్కలుగా చేసి, యుద్ధాన్ని మన శత్రువు యొక్క భూభాగానికి తీసుకెళ్లడమే మన ఆవశ్యకత.

మూలం: Sri Krishna Deva Raya Or Prithviraj Chauhan – Whom Should India Follow Today?

తెలుగు అనువాదం: @threadspanner

DISCLAIMER: The author is solely responsible for the views expressed in this article. The author carries the responsibility for citing and/or licensing of images utilized within the text.