అవును, ఇది అక్షరాలా నిజం!

మీరు మీ ఆహారపు అలవాట్లలో కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేయడం ద్వారా అధిక మొత్తంలో నీటిని ఆదా చేయవచ్చు – బియ్యం మరియు గోధుమల బదులు సిరి ధాన్యాలు వాడండి. చెరకు చక్కెర బదులు వేరే  సహజ ప్రత్యామ్నాయాలను వాడండి.

భారతదేశం ఈ రోజు ఆహార భద్రత కలిగి ఉంది, కాని అది నీటి భద్రతకు ముప్పు తో జరిగింది. ఇంకా, పోషణ విలువలును మెరుగుపరచడంలో విఫలమయ్యాము, జనాభాలో జింక్ మరియు ఇనుము లోపాలు విస్తృతంగా ఉన్నాయి.

 మంచినీటిని విస్తృతంగా వాడవలసిన ఆహార పంటలను ప్రోత్సహిస్తూ, ఆధునిక వ్యవసాయ పద్ధతులు లేకపోవడం, తక్కువ పంట దిగుబడి, అధిక శాతం వ్యవసాయ ఉత్పత్తుల వృధా , వీటన్నిటి మూలాన మనం మంచినీటి పర్యావరణ వ్యవస్థను అంచుకు నెట్టివేస్తున్నాము!

ప్రపంచంలోని మంచినీటి నిక్షేపాల్లో కేవలం 4% మన సొంతం. ప్రపంచ జనాభాలో 18% వాటా మన దేశానిది.

మన దేశ జనాభాని పోషించేందుకు మొత్తం మంచినీటి లో 80% వ్యవసాయానికి మాత్రమే మనము వాడేస్తున్నాము.

ఈ 80% నీటి వాడకంలో అధిక మొత్తం వెళ్ళేది అతి కొద్ధి ఆహార పంటలకు మాత్రమే.

మంచినీటిని స్వాహా చేసే ఆహార పంటలు

 వరి, చెరకు మరియు గోధుమలు, మంచి నీటిని స్వాహా చేసే ముఖ్యమైన మరియు విస్తృతంగా పండించే ఆహార పంటలు

1 కిలో వరి పండించడానికి 3,000 – 5,000 లీటర్ల నీరు వాడాలి.

1 కిలో చెరకు పెరగడానికి 1,500 – 3,000 లీటర్ల నీరు వాడాలి.

1 కిలో గోధుమలు పండించడానికి 1,000 లీటర్ల నీరు వాడాలి.

వరి పంట మంచినీటి వినియోగాన్ని ఇప్పుడు పరిశీలిద్దాము.

ప్రస్తుత 2020-21 సంవత్సరంలో మొత్తం దేశంలో సాగు చేయబడే వరి పంట కోసం మనం ఎంత నీటిని ఉపయోగిస్తాము:

117 మిలియన్ టన్నుల వరి పంట = 11.7 కోట్ల x 1000 కిలో x 3000 లీటర్లు ప్రతి కిలోకు = 351 లక్షల కోట్ల లీటర్లు

అవును, అక్షరాలా 351 లక్షల కోట్ల లీటర్లు!

ఆ సంఖ్యను ఒక దృక్పథంలో పెడదాము …

ఈ 351 లక్షల కోట్ల లీటర్లు ప్రస్తుత హైదరాబాద్ & సికింద్రాబాద్ జంట నగరాలకు 399 సంవత్సరాల నీటి సరఫరాను తీర్చగలదు!!

(ఇది ప్రస్తుత జంటనగరాల రోజువారీ వాడకం 637 మిలియన్ గ్యాలన్లు అంచనా ప్రకారం)

 మనం ఏమి చేయవచ్చు?

బియ్యం, గోధుమ మరియు చెరకు నుండి వేరే అధిక ఆరోగ్యకరమైన ఆహార పంటలకు మారి, నీటిని ఆదా చేద్దాం.

బియ్యం మరియు గోధుమలతో పోల్చితే సిరి ధాన్యాలలో పోషక విలువలు అధికం. అవి పెరగడానికి అతికొద్ది నీరు చాలు. పురుగులు మరియు తెగలు బెడద ఉండదు కాబట్టి పురుగుమందులు వాడి, ఆహారం ద్వారా రసాయనాలు మన లోపలికి చేరడం ఆగుతుంది.

వరితో పోల్చితే సిరి ధాన్యాల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయి. 

మాంసకృతులు లేక  ప్రోటీన్ (+ 1%), ఇనుము (+ 27%) మరియు జింక్ (+ 13%) అధికంగా ఉంటాయి.

యాదృచ్ఛికంగా, మన దేశ జనాభాలో నేడు ఇనుము మరియు జింక్ లోపాలు చాలా ప్రబలంగా ఉన్నాయి, ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

సిరి ధాన్యాలు మన రోజువారీ ఆహారంలో భాగంగా?

ఎన్నో వేల సంవత్సరాల నుండి సిరి ధాన్యాలు మనకు ప్రధాన ఆహారంలో భాగంగా ఉన్నాయి. సిరి ధాన్యాల ఆధారిత ఆహారం నుండి, నేడు వరి మరియు గోధుమ ఆధారితంగా మన ఆహార అలవాట్లు మారిపోయినవి.

 1956 లో, భారతదేశం వరి మరియు గోధుమల కంటే సిరి ధాన్యాలను అధికంగా ఉత్పత్తి చేసింది. 1960 దశకం నుండి, వరి మరియు గోధుమలను పండించటానికి వినియోగించే వ్యవసాయ భూమి క్రమంగా పెరిగింది. ఇదే కాలంలో సిరి ధాన్యాలు పండించడం క్షీణిస్తూ వస్తుంది.

 సిరి ధాన్యాల పంటలకు కనీస మద్దతు ధరకి అర్హత లేదు , కాబట్టి రైతులు వాటిని పెంచడానికి ప్రోత్సాహం లేదు. ఈ విధంగా, గత అనేక దశాబ్దాలుగా వరి  మరియు గోధుమలు పూర్తిగా ముఖ్య ఆహార పంటలుగా మారిపోయాయి.

 నేడు, కొన్ని సిరి ధాన్యాల ధరలు బియ్యం కంటే ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు, కొర్రలు ఇప్పుడు రూ. కిలోకు 80 రూపాయలు. ఇది విస్తృతంగా పెరగకపోవడమే దీనికి కారణం. వీటి పంట పరిమాణం పెరిగితే , ధర తగ్గుతుంది. తక్కువ నీటి వినియోగం మరియు పురుగుమందుల అవసరం లేకపోవడంతో, సిరి ధాన్యాల ధరలు, వరి మరియు గోధుమల ధరలకు చాలా పోటీగా మారతాయి, మనము వీటిని మళ్ళీ ముఖ్యమైన ఆహార పంటలుగా చేసుకుని అధికంగా పండిస్తే.

అకస్మాత్తుగా బియ్యం మరియు గోధుమలను పూర్తిగా వదలివేయాల్సిన అవసరం లేదు. సిరి ధాన్యాలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకొని క్రమంగా వాటి వినియోగం పెంచుకోవాలి. ఉదాహరణకు, వారంలో 2 పూటలు మాత్రమే వరి అన్నం కాకుండా రాగి అన్నం తినడం మొదలు పెట్టవచ్చు.

బియ్యం మరియు గోధుమలను ఉపయోగించి తయారుచేసే దాదాపు ప్రతి వంటకం సిరి ధాన్యాలతో చేయవచ్చు. సిరి ధాన్యాలతో  తయారుచేసే అనేక సాంప్రదాయ వంటకాలు ఉన్నాయి, వీటిని తిరిగి ప్రధాన వంటకాలుగా చేసుకోవచ్చు, మనం అలా చేయాలనుకుంటే!

ఎన్నో సరిక్రొత్త వంటకాలు కూడా సృష్టింపబడుతున్నాయి సిరి ధాన్యాలను వుపయోగించి.

చెరకు చక్కెరకు సహజ ప్రత్యామ్నాయాలు

చక్కెరకు ప్రత్యామ్నాయాలలో ముఖ్యమైనది స్టీవియా

స్టీవియా ఆరోగ్యానికి ఏంతో మంచిది, ఎందుకంటే ఇది సున్నా కేలరీలను అందిస్తుంది.

అలాగే ఇది చక్కెరకు 300 రెట్లు తియ్యగా ఉంటుంది. అందువల్ల, వినియోగ పరిమాణం విపరీతంగా తగ్గుతుంది.

చెరకు చక్కెరకు ఇతర సహజ ప్రత్యామ్నాయాలు తేనె, మేపుల్ సిరప్, యుకోన్ సిరప్, తాటి బెల్లం మొదలైనవి.

 చివరి మాట

బియ్యం, గోధుమలు మరియు చక్కెర వినియోగాన్ని తగ్గించడం ద్వారా, దీర్ఘకాలిక నీటి భద్రత కోసం మనందరమూ గణనీయమైన కృషి చేయవచ్చు!

మంచినీటిని ఆదా చేయవచ్చు మరియు అదే సమయంలో మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

ఇవన్నీ ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన వాతావరణానికి మరియు జీవన విధానానికి దారితీస్తాయి!

DISCLAIMER: The author is solely responsible for the views expressed in this article. The author carries the responsibility for citing and/or licensing of images utilized within the text.