మొన్న సెప్టెంబర్ 5 న, ఉపాధ్యాయుల దినోత్సవం. ఈ కాలంలో మన ప్రతి పండుగ రెండేసి రోజులు వచ్చినట్టు, ఒకటి మన భారతీయ తిథుల ప్రకారం అయితే, ఇంకొకటి పాశ్చాత్య కాలెండర్ ప్రకారం. అంతెందుకు, మన పుట్టిన రోజులు కూడా రెండేసే కదా? చిన్నప్పుడు, అందరిలా ప్రతిసంవత్సరం నా (కాలెండర్) పుట్టినరోజు ఎందుకు రావట్లేదు, ఐతే చాక్లేట్లు పంచడానికి మాత్రం ఇంకో (తిథుల) పుట్టినరోజు ఎలా వస్తోంది అని నా స్నేహితులకు చెప్పటానికి తల ప్రాణం తోకకొచ్చేది. అబ్బో ఇప్పుడా గోలంతా ఎందుకు కానీ, ఇంకొక సారి చెప్పుకుందాం. అదే సాంప్రదాయం లో, గురు పూర్ణిమ (ఆది గురువు దక్షిణామూర్తి/వేద గురువు వ్యాస మహర్షి పూజ్యోత్సవం) ఒకటి అయితే, మన పూర్వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవం ఇంకొకటి. ఈ రెండవ రోజునే ఉపాధ్యాయుల దినోత్సవం గా జరుపుకుంటున్నాం, ఆయన కూడా ఒక ఉపాధ్యాయుడు కదా. కాకపోతే, మా సంస్కృతం టీచరు గారు, ఆవిడని గురువు అని కాదు, ‘అధ్యాపికే’, ‘శిక్షికే’ అని మాత్రమే సంబోధించమంటుంటారు. గురు వేరు, అధ్యాపకుడు/పిక వేరు అని.

అయితే, గురువు గురించి చెప్పుకునేటప్పుడు, సాధారణంగా మనం రెండు శ్లోకాలు నేర్చుకుంటాం:

౧.
గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవేనమః ।।
గురువే బ్రహ్మ (సృష్టి కర్త), గురువే విష్ణువు (స్థితి కర్త), గురువే మహేశ్వరుడు (లయ కర్త). గురువు సాక్షాత్ పరబ్రహ్మయే (సత్యమైన బ్రహ్మము), అట్టి (తత్వ జ్ఞాన ఉపదేశకుడైన) గురువునకు నమస్కారము, అని దీని భావం.

౨.
అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా ।
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవేనమః ।।
అజ్ఞానమనే చీకటి చేత అంధులైనవారికి జ్ఞానమనే అంజనాన్ని పూసి, కన్నులు తెరిపించినట్టి గురువునకు నమస్కారము, అని దీని భావం.

గుకారశ్చాంధకారస్తు రుకార్తన్నిరోధకృత్‌ ।
‘గు’ అంటే చీకటి, ‘రు’ అంటే దానిని అడ్డగించువాడు. అజ్ఞానమనే చీకటిని తొలగించే శక్తే గురువు అని దీని భావం. హలం పట్టుకున్నా, కలం పట్టుకున్నా, నేర్పేవాడు ఉన్నప్పుడే దేని లోనైనా మెళకువలు తెలుస్తాయి. ఆ నేర్పించేవాడే గురవు. ‘గు’కారము గుణాతీత తత్త్వము, ‘రు’కారము రూప రహితము. లౌకిక, అలౌకిక, ఆధ్యాత్మిక తత్వములో, ఉపాద్ధ్యాయ, అద్ధ్యాపక, గురు గుణ రూపములు ఏంవైతేనేమి, మనను నడిపించడానికి కావాల్సిందే కదా.

ఉపాధ్యాయుల దినోత్సవం అన్నాను, గురువు గురించి ఏవేవో శ్లోకాలను వివరించాను, గురు శబ్దం యొక్క విశిష్టతని గురించి మాట్లడాను, సరే అంతాబావుంది, కానీ వీటన్నింటికీ ఈ శీర్షిక చందమామ కీ సంబంధం ఏమిటి అని, ఈ పాటికి మీకు సందేహం వచ్చే ఉంటుంది, రావాలి కూడా. అందులోకే వెళదాం.

అజ్ఞానాంధకారంలో జ్ఞానమనేవలుగుని చూపించేవాడు గురువైతే, మనకి అంధకారం లో తన వెన్నెలతో దారిని చూపించే చంద్రుడు కూడా గురువే కదా? మనకు ఊహ వచ్చినప్పటినుంచి, ‘చందమామ రావే, జాబిల్లి రావే’, అని పిలుస్తున్నాము. మనమే కాదు, మన తల్లిదండ్రులు, తాతముత్తాతలు, అవ్వముత్తవ్వలు, వాళ్ళ తల్లిదండ్రులు, తాతవ్వలు, అందరూ ‘మామా’ అనే పిలిచే వాళ్ళు. అందరికన్నా దగ్గర చుట్టం గా, మన మావయ్య గా, తెలుగు భాషలోనే కాదు, దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ, ఆప్యాయంగా ‘చందమామా’ అని పిలుచుకుంటున్నాం కదా. ఆ చందమామని చూసినవాళ్ళందరూ సంతోషించినవాళ్ళే, కావాలని మారాం చేసినవాళ్ళే. మానవమాత్రులం మనమేకాదు, శ్రీరాముడంతటివాడు కూడా వెనకకు ఇలాగే పేచీపెట్టాడుట. అప్పుడు వాళ్ళమ్మ కౌసల్య అద్దం తెచ్చి, అందులో చందమామ బింబం చూపిస్తే ఏడుపు మానాడట. ఆ రాముడెంతటి అమాయకుడో కదా!

అయితే, మన ముత్తాతల, తాతల కాలంలో రాలేకపోయినా, మన తల్లిదండ్రులకు, మనకు, మన అక్కచెల్లెళ్లకు, అన్నదమ్ములకు, కనిపించాడు; క్రింద భూలోకంలో పైన ఆకాశంలో, ఆయన చూసిన వింతలు, విడ్డూరాలు, చెప్పటానికి; కధలు, శాస్త్రాలు, పాటలు, పదాలు, గమ్మత్తులు, ఇలా ఎన్నో మనకు వినిపించటానికి; ఆ ఆకాశంలో వెలుగుని ఇస్తూ కూడా, ఒక పిల్లల మాసపత్రిక గా, ఆ చందమామ వినోదాత్మకంగా విజ్ఞానదాయకంగా మనలోని ఎంతో మందికి, ఎన్నో పాఠాలు నేర్పాడు.

చందమామ (పిల్లల మాస పత్రిక) ని బి. నాగిరెడ్డి మరియు చక్రపాణి గార్లు జూలై 1, 1947 న ప్రారంభించారు. ఆ మొదటి సంచిక లో, చందమామ ఆత్మకధలోని ఎన్నో వైజ్ఞానిక అంశాలు, చిన్న పిల్లల్లకు సులభంగా అర్థమయ్యేలా, ఎంతో విపులంగా, తనదైన శైలి లో, మనతో సూటిగా చందమామ చేతనే చెప్పించారు. ఆ కధలో, చందమామ అసలు మనకు చుట్టం ఎలా అయ్యాడో చెప్తాడు. మన అమ్మనీ, వాళ్లమ్మనీ, వాళ్ళమ్మనీ, అందరినీ కన్న అమ్మ (అమ్మలని గన్న అమ్మ), ఆవిడ ఒళ్ళోనే ఉంటున్నాం కదా, ఇంకెవరు, సూర్యుడు తాతయ్యగారి కూతురు అయిన భూదేవి. ఆవిడకు పుట్టినవాడే ఈ చంద్రుడు, అమ్మలందరికీ తోడబుట్టినవాడైన మావయ్య, చందమావయ్య, మన చందమామ. ఇలా, సామన్యమైన పదాలతో, చక్కటి నుడికారాలతో, జాతీయాలతో, సామెతలతో, పద విన్యాసాలు లేకుండా, చదువుతుంటే భావం మన హృదయానికి హత్తుకునిపోయే విధంగా, కధలని మలిచారు. దాని ప్రభావమే, చందమామ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా అని పిల్లలూ, వారి తల్లిదండ్రులూ ఉవ్విళ్లూరుతూ ఉండేవారు.

అందుచేత, ఈ ఉపాధ్యాయుల దినోత్సవం నాడు, అన్ని పాఠాలు నేర్పిన ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు, గురువు అయిన మన చందమామ, డబ్భైమూడేళ్ల క్రితం ఉపాధ్యాయుల దినోత్సవం నాడు (అప్పట్లో ఇంకా ఆ రోజుని ఉపాధ్యాయుల దినోత్సవంగా పిలవలేదనుక్కోండి, కానీ భలే కుదిరింది కదూ), ఆనాటి తరాలకి ఏంచెప్పాడో, వాళ్ళ వారసులుగా తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతో ఉంది.

అది స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే ముద్రించిన మొదటి ప్రచురణ, సెప్టెంబర్ సంచిక. అందులో తెలుగు బిడ్డలందరికీ చందమామ ఒక సందేశం ఇచ్చాడు. చాలా బాధ్యతాయుతమైన, విచారించ దగిన సందేశం. అంతే పదునైన, ఇప్పటికీ పరిశీలించ దగిన, ఆచరించ దగిన సందేశం. అదేంటో యథాతథంగా చూద్దాం.

[1]

భరత మాత భక్తి అంటే ఏమిటో, బానిసత్వం అంటే ఏమిటో, త్యాగం అంటే ఏమిటో, పరతంత్ర్యం నుండి స్వాతంత్ర్యం సంపాదించుకోటానికి ప్రాణాలు తృణప్రాయంగా అర్పించటం అంటే ఏమిటో, తెలియని మనకు, ఆనాడు ‘చందమామ’ ఇచ్చిన సందేశం, గురువుగా గత డబ్భైమూడేళ్ళగా నేర్పుతున్న భక్తి పాఠం, తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ సందేశం అప్పటికన్నా, ఈనాటి పరిస్థితులను చూస్తుంటే ఇప్పుడే ఇంకా ఎక్కువ అవసరమేమో అనిపిస్తోంది.

పాశ్చాత్యులు మనని విభజించి పాలించటానికి వేసిన ఎత్తులు పై ఎత్తులు అన్నింటినీ అధిగమించి, మన పెద్దలు తెచ్చిపెట్టిన స్వాతంత్ర్యం యొక్క విలువే తెలియకుండా, మళ్ళీ అవే విభజనలని రేపుతూ, అరిగిపోయిన గ్రామోఫోన్ రికార్డ్ లా అర్ధంపర్ధంలేని ఆర్యులు/ద్రవిడులు అంటూ ఒకరు, పొట్ట కోస్తే అక్షరం సంస్కృతం/ధర్మశాస్త్రం రాకుండా అగ్ర కులాలు/వర్ణాలు దళితులు/అంటరానివాళ్ళు అంటూ ఇంకొకరు. అసలు రాముడే లేడంటాడు ఒకడు, ఇంకొక పాశ్చాత్యుడు “The Last Sanskrit Pandit” బిరుదాంకితుడు (మన ఘనాపాఠీలకూ సంస్కృత అధ్యాపకులకూ మన సంస్కృతం/సంస్కృతి గురించి ఈయనే చెప్పాలి మరి, The White Man’s Burden అన్నారు కదా), ఈయన అంటాడు రాముడనే ‘పాత్ర’ని తురకఉన్మాదులు మనని ఆక్రమించినప్పుడు మనం సృష్టించుకున్న కట్టు‘కధలు’ట, అక్కడితో ఆగారా, మన భారతీయ కళలలో అసలు రసమే లేదంటారు ఈ “పండితులవారు”. దాంతో ఈ “ఆఖరి సంస్కృత పండితులవారి”కి ఐదువందల సంస్కృత సాహితీరత్నాల ఆంగ్లానువాదానికి కోటానుకోట్లు ఇచ్చిమరీ మనవాళ్ళే ప్రోత్సహిస్తున్నారు, ఇది అదునుగా చేసుకుని అసలు అయోధ్యలో రాముడి గుడే లేదంటారు కొందఱు “Eminent Historian”లు, కళ్లముందు కూల్చివేయబడిన శిథిలాలు కనిపిస్తున్నా. వాళ్ళలో ఓ పెద్దావిడకి, ధర్మరాజు అశోకుడి నుండి ప్రేరణ పొందటం ఇలాంటివి కూడా అనిపిస్తుంటాయి పాపం, వాళ్ళ అమ్మాయి ఝాన్సీ లక్ష్మీబాయి నో వాళ్ళ అబ్బాయి టిప్పు సుల్తాన్ నో, బంగాళా భౌభౌనా లేక అరటి పండు లంబాలంబానా, ఈ మధ్యన ఏది ఎక్కువగా స్వీకరిస్తున్నారు అని అడిగి తెలుసుకోవాలి. వీళ్ళు మన పిల్లల పుస్తకాలు రాయడం, మనం అవి చదివించటం. విశ్వనాథ సత్యనారాయణ గారి ‘విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు’ నవల గుర్తుంది కదా, అసలా విష్ణు శర్మ అనేవాడే లేడు ఆయన పంచతంత్రమూ రాయలేదు, అన్న విశ్వనాథ సత్యనారాయణ గారికి వచ్చిన పీడకల ఈమధ్యన రోజుకో కొత్త రూపం దాలుస్తోంది. ఈ పిచ్చికి పరాకాష్ట ఏమిటంటే, బ్రిటీషు వారు రాకమునుపు అసలు భారత దేశమే లేదంటాడొకడు, మరి ఆ (British/French/Dutch) East “India” Company లు, ఆ మహా’భారతం’, ఈ భారతవర్షం ఏమిటి చెప్మా? సింపుల్ గా, East Kakinada Company అనో, East Kolakata Company అనో, East Kochi Company అనో, లేక East Mumbai Company అనో పేర్లు పెట్టుకోలేకపోయారా? వీటిల్లో ఎక్కడికి వచ్చినా భారత దేశం వచ్చేశాం అన్న విషయం వాళ్ళకి తెలిసింది గాని, వాళ్ళు వెళ్లి డబ్బై మూడు సంవత్సరాలు అయినా ఈ మానసిక బానిసత్వం (Mental Colonization) లో ఇంకా మునిగి ఉన్న మన బుర్రలకి మాత్రం అర్ధం కాలేదు. ఈ చెత్తంతా చదివి, మన పురాణాలూ, ఇతిహాసాలు, శాస్త్రాలు అన్నీ మర్చిపోయి, భారతం లోంచి కాశ్మీర్ ని తెంచేద్దాం అంటాడు ఒకడు, అసలీ భారత దేశానికి కాశ్మీరుకి సంబంధమే లేదంటాడు ఇంకొకడు. మరి కాశ్మీరు పేరెక్కడనుంచి వచ్చింది కాశ్యప ముని నుండే కాదా? సరస్వతీ దేవి పేరు కాశ్మీరపురవాశిని కాదా? శంకరాచార్యులవారు అక్కడొక శారదా పీఠం పెట్టలేదా, భారతం నలుమూలలా రెండుసార్లు చుట్టలేదా? మరొకడు ద్రావిడనాడు ని సాధిద్దాం అంటాడు మన భాషలే వేరంటాడు, ఇంకొకడు తూర్పున ఉన్న ఏడుగురు అక్కచెల్లెళ్లనీ భరతమాత నుంచి వేరుచేసేద్దాం అంటాడు, (Chicken Neck) పీకనొక్కేద్దాం అంటాడు, వినటానికే విడ్డూరంగా అనిపించేట్టు, హిందువుల నుండి భారతీయులకు “ఆజాదీ” కావాలంటాడు. ఇప్పటికే అఖండ భారత వర్షం లోని ఎన్నో భాగాలు – వేరే రాష్ట్రాలుగా, దేశాలుగా విభజించబడిపోయి, మన సంస్కృతిని ధర్మాన్ని మరిచిపోయి, దారుణమైన జీవనాన్ని సాగిస్తున్నాయి. ఇలా భరత మాత తల కాళ్లూ చేతులూ కోసుకుంటూ పోతే, ఇంకా ముక్కలు చేసుకుంటూ పోతే ఏం నష్టపోతామో తెలుసుకోలేకపోతున్నారు ఇవ్వాల్టి జనులు.

వ్యాసం ఒకవైపునుంచి ఇంకోవైపుకు తిరిగిందేంటి అనుకుంటున్నారా?

అసలు ఈ అవిద్య నుండి పిల్లలు విద్యవైపు మళ్లాలంటే; మళ్లీ ఇప్పటి పిల్లలు సత్ప్రవర్తనతో, బాధ్యతాయుతమైన భరత మాత పౌరులుగా, నిజాయితీ, లోకజ్ఞానం, నైతిక ప్రవర్తన, కృతజ్ఞత, వినయం, పెద్దల పట్ల గౌరవం, రాష్ట్ర/దేశ/ఆత్మాభిమానం, పౌరుషం, దృఢ సంకల్పం, సంస్కారం మొదలగు మంచి లక్షణాలను అలవరచుకునేలా ఎదగాలంటే; భారతీయ నాగరిక కధనాన్ని (Bhāratīya Grand Narrative) అర్థంచేసుకోవాలంటే, మామా, ఓ చందమామా, ఈ డోరేమాన్, పెప్ప పిగ్, డి.సి., మార్వల్, హాలీ/బాలీ/టాలీవుడ్, హిస్టరీ ల చెత్త కథలనీ కధనాలనీ ‘లయం’ చేసి విసిరి పారెయ్యాల్సిందే; నీ ఇతిహాస, పురాణ, జానపద, పంచతంత్ర, భేతాళ, జాతక, ఉపనిషత్తుల కథలను, కథాసరిత్సాగర ‘సృష్టి’ ని మళ్ళీ వినాల్సిందే, తనివి తీరా చదవాల్సిందే. వినిపిస్తావు కదూ? చదివిస్తావు కదూ? మామా మా ‘చందమామా’ !

[1]. పైన ఉపయోగించిన చిత్రాల మరియు కథల కాపీరైట్సు అన్నీ చందమామ పత్రికవే, అవి ఏవీ నావికావు…

DISCLAIMER: The author is solely responsible for the views expressed in this article. The author carries the responsibility for citing and/or licensing of images utilized within the text.