జీ హెచ్ ఎం సి ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చాలామంది ‘సారు’ గారి కారు ‘బండి’ సంజయ్ బండికి గుద్దుకొని బోల్తా పడింది అంటున్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి అనుకున్నట్టుగానే తన సత్తా చూపింది. ఇప్పటివరకూ దక్షిణ భారతదేశం లో పాగా వేయాలని సకల ప్రయత్నాలు చేస్తున్న బీజేపికి కర్ణాటకలో మాత్రమే సఫలత లభించింది. కర్ణాటక దాటి దక్షిణాదిలో విస్తరించాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు నెమ్మదిగా నెమ్మదిగా సఫలీకృతమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కర్ణాటక తర్వాత తెలంగాణా భారతీయ జనతా పార్టీ కి ఎర్ర తివాచీ పరుస్తున్న పరిస్థితి రూపుదిద్దుకుంటోంది. మొన్న మొన్నటి వరకూ అసెంబ్లీలో కేవలం ఒక్క సీటు మాత్రమే ఉన్నటువంటి బిజెపి ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించి తనలో జవసత్వాలు నింపుకుంది. ఇక అదే ఉత్సాహంతో జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా జాతీయ స్థాయి నాయకులను ప్రచార రంగంలోకి దించి నగరంలో వేళ్ళూనుకున్న తెరాస మరియు ఎంఐఎం పార్టీలకు గట్టి సవాల్ విసిరింది.

మంచి సైద్ధాంతిక నిబద్ధత ఉన్న నాయకుల, కార్యకర్తల బలం బిజెపికి ఉండడంతో జిహెచ్ఎంసి ఎన్నికల్లో పటిష్టమైన వ్యూహంతో ఆ పార్టీ శ్రేణులు ముందుకు కదిలాయి. ప్రజల్లో తెరాస ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత, ఎంఐఎం-తెరాస ల మధ్య వెల్లివిరుస్తున్న దోస్తీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న భయాలకు ఈ ఎన్నికల ఫలితాలు అద్దం పట్టాయి. తెరాస పార్టీ కి వరుసగా ఎన్నికల్లో చుక్కెదురవుతుండడంతో ఇక రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనకు ఎదురుగాలి వీస్తున్నదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీనంతటికి కారణం కెసిఆర్ నియంతృత్వ విధానం, ఏదో విధంగా రాష్ట్రంలో తన కుటుంబ పాలనను సుస్థిరం చేసుకోవాలనే ఆరాటం, విపరీతంగా పేరుకుపోయిన అవినీతి, ప్రకృతి విపత్తుల సమయంలో పాలనా పరమైన వైఫల్యాలు, ముఖ్యంగా ఎంఐఎం తో వాళ్ల దోస్తీ, ఇవన్నీ కెసిఆర్ నాయకత్వంలో తెరాస పార్టీకి వ్యతిరేకంగా పని చేశాయి.

ఇక దేశవ్యాప్తంగా కుంచించుకు పోతున్న కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసి ఎన్నికలలో కూడా రెండు సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసారు. ఇక కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు బిజెపిలోకి వలస పోవడానికి సిద్ధమవుతున్నారు. దీన్ని బట్టి అర్థమయ్యే దేమిటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా అంతరించిపోతోంది. ఇక చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఖాతా కూడా తెరవలేక చతికిల పడింది. అంటే ఇక జిహెచ్ఎంసి పరిధిలో కేవలం మూడు పార్టీలు మాత్రమే మిగిలాయి.

ఇక ఎంఐఎం విషయానికి వస్తే కేవలం ముస్లిం పార్టీ కాబట్టి ముస్లింలంతా గంపగుత్తగా ఆ పార్టీకి మాత్రమే ఓటు వేయడంతో 44 సీట్ల వరకు గెలిచారు. చాలామంది రాజకీయ విశ్లేషకులు హైదరాబాద్లో జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోలరైజేషన్ జరుగుతోందని ఈ పోలరైజేషన్ కంతటికీ కూడా భారతీయ జనతా పార్టీ కారణమంటూ విమర్శిస్తున్నారు. కానీ ముస్లింలంతా గంపగుత్తగా తమ ముస్లిం పార్టీకే ఓట్లు వేస్తున్నప్పుడు హిందువులు బిజెపికి ఓటు వేయడంలో తప్పేమిటని మరికొంత మంది విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం తెరాస పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ఆ పార్టీ మేయర్ స్థానాన్ని పొందడానికి అవసరమైన సీట్లు గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే కానీ మేయర్ స్థానాన్ని పొందలేదు. ఇక తెరాసా కు తాను ఎప్పటినుండో దోస్తీ చేస్తున్నటువంటి ఎం ఐ ఎం తో మరొకసారి జట్టు కట్టడం మినహా వేరే మార్గం కనిపించడం లేదు. ఒకవేళ తెరాసా మళ్ళీ ఎంఐఎం తో జట్టు కడితే అది బీజేపీకి మరొక అస్త్రంగా పరిణమించే అవకాశం ఉంది. పాతబస్తీలో ఎంఐఎం వాళ్ళు చేస్తున్నటువంటి మత రాజకీయాలు, బెదిరింపులు, అరాచకత్వం పట్ల ఇప్పటికే విసిగివేసారి ఉన్న ప్రజలు తెరాస – ఎంఐఎం ల మధ్య దోస్తీని తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది. అది ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున నష్టం చేకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే తెరాస పార్టీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా తయారైంది.

కెసీఆర్ కుటుంబ సభ్యులైన కవిత, హరీష్ రావు, కేటీఆర్ లు ఎక్కడ పనిగట్టుకొని ప్రచారం చేసినా అక్కడ పార్టీ ఓడిపోతుండడంతో తెరాసా పార్టీ శ్రేణులకు ఏంచేయాలో పాలుపోని పరిస్థితి. ఈ ఎన్నికల ఫలితాలు తెలంగాణ లో తెరాస పార్టీకి కేవలం బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాయి. మొన్నమొన్నటి వరకు కెసిఆర్ బిజెపి ఎక్కడ ఉంది అంటూ ప్రశ్నించేవారు. బిజెపి ఎక్కడుందో ప్రజలు చెప్పకనే చెప్పారు. ఇక ఎటువంటి సైద్ధాంతిక నిబద్ధత లేని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఓట్లు వేసినప్పటికీ టిఆర్ఎస్ కు అమ్ముడు పోతారు అనే ఆలోచన ప్రజల్లో బలంగా నాటుకు పోవడంతో కాంగ్రెస్ కు వేసే ప్రతి ఓటు వృధా అయిపోతుంది అని ప్రజలు భావించినట్లుగా ఉన్నారు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ తన ప్రచారంలో తెరాసకు వేసే ప్రతి ఓటు ఎంఐఎంకు వేసినట్లే అంటూ చేసిన ప్రకటనలు కూడా ప్రజల మనస్సుల్లో బలంగా నాటుకుపోయాయి అనే విషయం స్పష్టమవుతున్నది.

ఏదేమైనప్పటికీ జీ హెచ్ ఎం సి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం ఒక నూతనాధ్యాయానికి తెరతీసిందని చెప్పవచ్చు. ఇకనుండి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఆసక్తి కరంగా మారే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో తనకున్న రాజకీయ ప్రాబల్యాన్ని ఆసరాగా చేసుకొని జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పాలని కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు కూడా ఈ వరుస పరాజయాలు గండి కొట్టే అవకాశం ఉన్నది.

DISCLAIMER: The author is solely responsible for the views expressed in this article. The author carries the responsibility for citing and/or licensing of images utilized within the text.